Special Trading Session On 18 May 2024: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (BSE) ఈ రోజు (శనివారం) కూడా ట్రేడింగ్ జరుగుతుంది. అయితే, ఇది రెగ్యులర్‌గా జరిగే సెషన్ కాదు, స్పెషల్ ట్రేడింగ్ సెషన్. దీనిలో టైమింగ్స్, ప్రైస్ బ్యాండ్స్ మారతాయి.
ఈ రోజు జరిగే ప్రత్యేక సెషన్‌లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ జరుగుతుందని ఎన్‌ఎస్‌ఈ ఈ నెల ప్రారంభంలోనే ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ రోజు, డిజాస్టర్ రికవరీ సైట్ (Disaster Recovery Site) వద్ద ఇంట్రాడే నిర్వహిస్తారు. డీఆర్ సైట్ వద్ద స్పెషల్ ట్రేడింగ్ సెషన్ చేపట్టడం ఇదే తొలిసారి కాదు, ఈ ఏడాది మార్చి 2న కూడా ఇదే విధమైన ట్రేడింగ్ సెషన్ నిర్వహించారు.
ఈ రోజు ప్రత్యేక సెషన్ ఎందుకు?
సైబర్ దాడులు, సాంకేతిక సమస్యల వంటి ఆకస్మిక సందర్భాల్లో స్టాక్ ఎక్సేంజీలు & ఇన్వెస్టర్ల డేటాను రక్షించేలా DR సైట్ పని చేస్తుంది. ఫలితంగా, ట్రేడింగ్‌కు అంతరాయం ఉండదు, పైగా మరింత సురక్షితంగా మారుతుంది. హ్యాకింగ్ లేదా మరే టెక్నికల్ గ్లిచ్ వల్లనైనా మార్కెట్లు క్రాష్ అయితే ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నష్టపోకుండా ఉండేందుకు డిజాస్టర్ రికవరీ (DR) సైట్‌ను రూపొందించారు. ఇలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు ట్రేడింగ్‌ను ప్రైమరీ సైట్ నుంచి DR సైట్‌కు మారుస్తారు. ఈ రోజు జరిగే సెషన్‌లో డీఆర్ సైట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు.
ఈ రోజు జరిగే సెషన్‌లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లంతా యథాప్రకారం షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు చేయవచ్చు. మార్కెట్ పార్టిసిపేంట్స్ అందరూ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌కు సిద్ధం కావాలని స్టాక్ ఎక్సేంజ్‌లు కూడా సూచించాయి.
DR సైట్ తేవడానికి కారణం
మూడేళ్ల క్రితం, 2021 ఫిబ్రవరి 24న, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఒక సాంకేతిక సమస్య ఏర్పడింది. ఫలితంగా, NSEలో ట్రేడింగ్ ఆ రోజు ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 03.45 గంటల మధ్య నిలిచిపోయింది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి టెక్నికల్ ఇబ్బందులు తలెత్తినప్పుడు డేటాను రక్షించుకునే వ్యవస్థ ఉండాలని అప్పుడే నిర్ణయించారు. ఫలితంగా డీఆర్ సైట్ రూపొందింది.
ట్రేడింగ్‌ను ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్‌కు మార్చడం ద్వారా ఆ సైట్ ఎలా పని చేస్తుందో తనిఖీ చేస్తారు. ఇంకా ఏవైనా మార్పులు, అప్‌డేట్స్ అవసరమైతే వాటినీ యాడ్ చేస్తారు. ఆ వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతారు.
రెండు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లు
ఎన్‌ఎస్‌ఈ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రెండు సెషన్లలో ఈ ట్రేడ్ జరుగుతుంది. మొదటి ట్రేడింగ్ సెషన్‌లో ప్రి-ఓపెన్ సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి 9:08 గంటల వరకు ఉంటుంది. సాధారణ ట్రేడింగ్ ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు, ప్రాథమిక సైట్‌లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11:15 గంటల వరకు గ్యాప్ ఇస్తారు.
రెండో ట్రేడింగ్ సెషన్ డీఆర్ సైట్‌లో జరుగుంది. ఉదయం ఉదయం 11:15 గంటల నుంచి 11:23 గంటల వరకు ప్రి-ఓపెన్ సెషన్ జరుగుతుంది. ఆ తర్వాత సాధారణ ట్రేడింగ్ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. పోస్ట్-క్లోజ్ ఆర్డర్ ముగింపు, సవరణలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతిస్తారు.
మార్చి 2న జరిగే ప్రత్యేక సెషన్‌లో డెరివేటివ్ ప్రొడక్ట్స్ సహా అన్ని సెక్యూరిటీల గరిష్ట ప్రైస్ బ్యాండ్‌ను 5 శాతంగా నిర్ణయించారు. మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ కాంట్రాక్టులకు కూడా ఇది 5 శాతంగా ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Vodafone, ZEE, Delhivery, Zydus Life