Elections 2024 :  అనంతపురం జిల్లాలో నిన్న మొన్నటి వరకు అభ్యర్థుల ప్రచారాల హో.. అభ్యర్థుల ఇళ్ల వద్ద నాయకులు,కార్యకర్తలు, ఓటర్లు హంగామా. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది టెన్షన్ తేరింది అనుకున్నారు. కానీ ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలుపు లెక్కలతో ఎవరికి వారు టెన్షన్లు పెంచుకుంటూ పోతున్నారు. 


పోటీచేసిన అభ్యర్థుల్లో టెన్షన్   


టికెట్ రానంత వరకు టికెట్ రాదేమో అని భయపడిన నేతలు టికెట్ వచ్చి బరిలో నిలిచిన అనంతరం గెలుస్తామో లేదో అన్న భయం వెంటాడుతుంది. ఇన్ని రోజులు నేతలు నాయకులు కార్యకర్తలు ఓటర్లతో సందడిగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం పోలింగ్ అయిపోవడంతో ఎక్కడి వారు అక్కడ స్తబ్దుగా ఉండిపోయారు. ఎవరు గెలుస్తారో అంటూ ఎవరి అంచనాలు వారు వేసుకుంటూ వారిలో వారే మథనపడుతున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఇదే పరిస్థితి. చిన్న టీ కొట్టు దగ్గర నుంచి హై క్లాస్ ఆఫీసుల వరకు ఎవరు గెలుస్తారు ఎంత మెజార్టీ వస్తుంది అన్న చర్చే నడుస్తోంది. పోటీ చేసిన అభ్యర్థులు పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల గెలుస్తామో లేదో అన్న టెన్షన్ కనిపిస్తోంది. జూన్ 4 ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తమ భవిష్యత్తు తేలిపోనుందా అని నేతలు టెన్షన్ పడుతున్నారు. 


 జోరుగా బెట్టింగులు  


ఆట ఏదైనా బెట్టింగ్ రాయుళ్ళకు పండగ లాంటిదే.. క్రికెట్ నుంచి మొదలుకొని ఆన్లైన్ గేమ్ల వరకు అన్నిచోట్ల బెట్టింగ్  హవా కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ బెట్టింగుల జోరుగా సాగుతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏ ప్రభుత్వం అధికారం చేపడుతుంది ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది అంటూ పందెం రాయళ్ళు పందాలు కాస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం నియోజకవర్గలలో ఎవరు గెలుస్తారు అంటూ పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. 5000 నుంచి మొదలైన ఈ బెట్టింగులు సుమారుగా లక్షల  వరకు పందాలు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 


ప్రభుత్వం ఏర్పాటుపై బెట్టింగులు   


నిన్నటి వరకు కేవలం అభ్యర్థులపై వారి అభిమాన నాయకులు గెలుస్తారని పందాలు కాసిన పందెం రాయళ్ళు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐ ప్యాక్ సమావేశంలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని 151 సీట్లని దాటుతున్నామని చెప్పడంతో ఒకసారిగా బెట్టింగ్ రాయుళ్లు ప్రభుత్వ ఏర్పాటు పై కూడా పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారు. అవి కూడా లక్షకు లక్ష అన్నట్టు ఉన్న పందాలు ఒక్కసారిగా జగన్ మాటలతో వైసిపి నేతలు అత్యుత్సాహంతో రేటింగ్ ఇస్తూ పందాలు కాస్తున్నారు. ఈ పందాలు కాస్త ఎంతవరకు వెళ్తాయో అని కొందరు భయపడుతున్నారు. 


 బెట్టింగులతో రోడ్డును పడిన కుటుంబాలు  


గత ఎన్నికల్లో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ప్రభుత్వ ఏర్పాటుపై పందాలు కాసిన పందెం రాయళ్ళు భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఏకంగా తమ ఇల్లు, ఆస్తులు తాకట్టు పెట్టి మరి పందెంలో ఓడిపోయిన డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారం ఎవరికి వచ్చినా కూడా ఒరిగేదేమీ లేదని అంటున్నప్పటికీ తమ అభిమాన నాయకులు గెలుస్తారన్న పట్టుదల దీమాలతో పంతాలకు పోయి చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా పందాలు కాస్తూ కుటుంబాలని రోడ్డు మీదకు తెస్తున్నారు పందెం రాయుళ్లు.