Police Force At BJP And Congress Offices In Hyderabad Due To KTR Investigation: ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను (KTR) ఈడీ గురువారం విచారిస్తోంది. గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరిన కేటీఆర్ నేరుగా ఈడీ (ED) కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దాదాపు 200 మంది సిబ్బంది మోహరించగా.. బాష్పవాయువు, వాటర్ కెనాన్లను అందుబాటులో ఉంటారు. కేటీఆర్ విచారణకు హాజరయ్యే సమయంలోనే భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకోగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద బందోబస్తు


మరోవైపు, కేటీఆర్ విచారణ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వెళ్లే రహదారిపై ఇరువైపులా పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వద్ద కూడా భారీగా బందోబస్తు చేపట్టారు.


కొనసాగుతోన్న కేటీఆర్ విచారణ


కాగా, దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా ఉన్న అప్పటి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ (HMDA) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. గురువారం కేటీఆర్‌ను ఈడీ విచారిస్తోంది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపైనా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ నుంచి వివరాలు తెప్పించుకున్న ఈడీ మరింత లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం.


ఒప్పందాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు.  ఫెమా నిబంధనలను ఉల్లఘించి విదేశీ కంపెనీకి నిధులు ఎంత పంపారు. ఎలా పంపారు. అవి చివరికి ఎవరి ఖాతాలో పడ్డాయి. ఇందులో కేటీఆర్‌తోపాటు అధికారు పాత్ర ఎంత. ఏ ఉద్దేశంతో ఈ వ్యవహారం నడచింది. అన్న వివరాలను ఈడీ తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈడీ కేటీఆర్‌పైకేసు పట్టే అవకాశాలను పరిశీలంచనుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.


ఈ కేసులో ఇప్పటికే అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించగా.. ఈ నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 'డిస్మిస్డ్ యూజ్ విత్‌డ్రాన్'గా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అటు, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ పెడుతున్న కేసులు తమ ఘనతను తుడిచేయలేవని అన్నారు.


Also Read: BRS Defecting MLAs: ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్‌లోకి - ప్రచారంలో నిజం ఎంత ?