Heavy Floods: తెలంగాణతోపాటు  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుగా మారాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆలమట్టిలోకి లక్షా 7 వేల 769 క్యూసెక్కులు ప్రవాహం ఉండగా... నీటిమట్టం 54.56 టీఎంసీలకు చేరుకుంది. 6,671 క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. జూరాలకు 41,925 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రాజెక్టులో పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ఆదివారం రోజు 8.75 టీఎంసీల నీటిమట్టం ఉంది. 8,904 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ కు 5,081 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 17.80 టీఎంసీలకు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకూ వరద ప్రవాహాలు పెరిగాయి. శ్రీరామ సాగర్ ప్రాజెక్టుకు లక్షా 21 వేల 8 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా... 882 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలకు గాను 6.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 


75 గేట్ల ద్వారా నీటిని వదులుతున్న అధికారులు


నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22,440 క్యూసెక్కుల వరద వస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 5,917 క్యూసెక్కుల వరద వస్తుండగా 385 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 21.04 టీఎంసీలకు చేరుకుంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద వస్తుండగా... 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నారు.  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఆదివారం రోజు ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగించారు. ఎగువన ఐదు, దిగువన నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారు. సాయంత్రానికి ఎగువన 175 మెగావాట్లు ఉత్పత్తి చేయగా.. దిగువన 145 మెగావాట్లు ఉత్పత్తి చేసినట్లు జెన్ కో ఎస్ఈ రామ సుబ్బారెడ్డి తెలిపారు. 


50 అడుగుల ఎత్తు ఉండే వంతెనను తాకుతూ..


అలాగే తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయిన ఆదిలాబాజ్ జిల్లా జైనథ్ మండలం డొల్లార వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై 14 గంటల పాటు వాహనాల రాకపోకలుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాదాపు దశాబ్దం కాలం తర్వాత 50 అడుగుల ఎత్తు ఉండే వంతెనను తాకుతూ పెన్ గంగా నది ప్రవహించింది. వరద ఉద్ధృతి క్రమంగా పెరగడంతో శనివారం రాత్రి 8 గంటలకు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. జైనథ్ తహసీల్దార్ రాఘవేంద్ర రావు, ఎంపీడీఓ గజానన్ రావు, సీఐ నరేష్ కుమార్ లతో కూడిన అధికారుల బృందం రాత్రంతా అక్కడే ఉండి పరిస్థితులను అంచనా వేసింది. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంది. ఎన్ హెచ్ఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆదివారం ఉదయం పెన్ గంగా వంతెనతో పాటు వరద ఉద్ధృతిని పరిశీలించింది.


20 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు


అప్పటి వరకు 5 లక్షల క్యూసెక్కులు ఉన్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఉదయం 10 గంటలకు వాహనాల రాకపోకలను అనుమతించారు. అప్పటికే ఇటు ఆదిలాబాద్ అటు మహారాష్ట్ర వైపు దాదాపు 20 కిలో మీటర్ల మేర రెండు వరుసల్లో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రానమ్మ, కలెక్టర్ రాహుల్ రాజ్ పెన్ గంగ వరద ఉద్ధృతితో పాటు ఎగువన ఉన్న చనాఖా-కొరాటా బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. పెన్ గంగ ఉద్ధృతి కారణంగా కలుగుతున్న నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు.