Harish Rao :   కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు.  పార్ల‌మెంట్ సాక్షిగా చెప్పిన నిజాల‌ను ఇప్పుడు అబ‌ద్ధాలుగా ప్ర‌చారం చేస్తున్నారని హరీష్ విమర్శించారు.  వారిది నోరు అనుకోవాలా? మోరి అనుకోవాలా? అని ప్ర‌శ్నించారు. పూట‌కో మాట మాట్లాడుతూ.. అవ‌స‌రం ఉంటే ఓ తీరు.. లేక‌పోతే ఓ తీరు.. ప‌ద‌వుల కోసం ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారన్నారు.  గతంలో ప్రాజెక్టును మెచ్చుకుని ఇప్పుడేమో అవినీతి జ‌రిగిందంటున్నారు.. అనుమ‌తులు, అప్పులు ఇచ్చింది మీరే క‌దా? అని హరీష్ ప్రశ్నించారు.  డీపీఆర్ తో పాటు అన్ని విష‌యాల‌ను ప‌రిశీలించాకే అనుమ‌తులు ఇచ్చారు. మీకు న‌చ్చితే నీతి.. న‌చ్చ‌క‌పోతే అవినీతా అని నిలదీశారు. 


కాళేశ్వరంకు అనుమతులు, అప్పులు ఇచ్చింది మీరేగా ?


కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీఎం కేసీఆర్ అద్భుతంగా ప‌ని చేశార‌ని మోదీ పార్ల‌మెంట్‌లో మెచ్చుకున్నారని హరీష్ రావు గుర్తు చేశారు.   ఈ ప్రాజెక్టుకు తానే అనుమ‌తి ఇచ్చాను. తెలంగాణ‌కు గ్రోత్ ఇంజిన్ అయింద‌ని.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ‌డ్క‌రీ చెప్పారన్నారు.  దేశంలో ఏప్రాజెక్టు క‌ట్టినా కూడా దానికి సీడ‌బ్ల్యూసీ అనుమ‌తి త‌ప్పనిస‌రి. సీడ‌బ్ల్యూసీ చైర్మ‌న్ మ‌సూద్ హుస్సేన్ కూడా కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించి మెచ్చుకున్నార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.  అయినప్పటికీ ఇప్పుడు రాజకీయాల కోసం అబద్దాలు చెబుతున్నారని హరీష్  రావు విమర్శిస్తున్నారు.సీఎం కేసీఆర్ ఈ మ‌ధ్య కాలంలో కేంద్ర ప్ర‌భుత్వ నిజ‌స్వ‌రూపాన్ని ఎండ‌గ‌డుతున్నారని అందుకే బీజేపీ నేత‌ల‌కు క‌డుపు మండుతోందని హరీష్ రావు అంటున్నారు.  


కాళేశ్వరంలో అవినీతి అంటూ  షెకావత్ విమర్శలు


బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ వచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కాళేశ్వరంలో అవినీతి హద్దులు దాటిందని ఆరోపించారు.  అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సరైన అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్‌ నిర్మించారన్నారు.భారీ వర్షాలకు 3 పంప్‌హౌజ్‌లు మునిగిపోయాయన్నారు. పంప్‌లను టెక్నికల్‌గా సరైన పద్దతిలో అమర్చలేదని, ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేలకోట్ల అవినీతి జరిగిందని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దుయ్యబట్టారు. పంప్‌ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉందన్నారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్‌ సామర్థ్యం లేదని కేంద్రమంత్రి అన్నారు. ఈ విమర్శలపైనే హరీష్ రావు స్పందించారు. 


వరదలతో  రెండు పంప్‌ హౌస్‌లకు నష్టం


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లు నిర్మించారు. వీటిలో అన్నారం,   కన్నెపల్లి పంప్‌‌ హౌస్‌‌లు మునిగిపోయాయి.  కన్నెపల్లి నీళ్లన్నీ తోడిన తర్వాత చూస్తే మోటార్లు పూర్తి స్థాయిలో పాడైపోయినట్లుగా తేలింది.  ప్రొటెక్షన్ వాల్, క్రేన్లు, లిఫ్టు కూలడంతో మోటార్లు ధ‌్వంసం అయ్యాయి.   అన్నారంలో మరీ అంత తీవ్రం కాకపోయినా మోటార్లు దెబ్బతిన్నాయి.వీటిపైనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే నెలలో అన్నింటినీ పునరుద్ధరిస్తామని మంత్రి ప్రకటించారు. 


బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు, అక్కడ పుట్టిఉంటే బండ్లానీ అయ్యేవాడిని - బండ్ల గణేష్