Anakapalli News : అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళా సబ్ ఇన్స్ స్పెక్టర్ సీఎం జగన్ చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ స్వీకరించారు.  ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఎస్సైగా రికార్డులకెక్కారు.  ఎస్ఐ విక్టోరియా రాణిని జిల్లా ఎస్పీ గౌతమి శాలి అభినందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ ట్రాఫిక్  రికార్డ్స్ బ్యూరో లో మహిళా సబ్ ఇన్స్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు పి.విక్టోరియా రాణి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం జరిగిన 76వ స్వాతంత్ర్య వార్షికోత్సవ  వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్  సర్వీస్ అవార్డును(IPM) అందుకున్నారు.


30 ఏళ్ల సర్వీస్ లో 


ఎస్ఐ విక్టోరియా రాణిని అనకాపల్లి ఎస్పీ గౌతమి శాలి అభినందించారు. ఆమె కార్యాలయంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆమె విశాఖపట్నం జిల్లాలోనే ఈ అవార్డును పొందిన తొలి మహిళా పోలీస్ అధికారి కావడం గమనార్హమని ఎస్పీ గౌతమి శాలి అన్నారు. విక్టోరియా రాణి తన 30 సంవత్సరాలు విధి నిర్వహణలో భాగంగా అనేక ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు  అందుకున్నారన్నారు. ఆమె సీబిఐలో అవినీతిపరుల భరతం పట్టినందుకుగాను  47 నగదు బహుమతులను పొందారని ఎస్పీ తెలిపారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పనిచేసినప్పుడు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేయడంలోనూ, వారిని ఇంటరాగేషన్ చేయడంలోనూ విక్టోరియా రాణి ముఖ్యపాత్ర పోషించారన్నారు. ఎన్.డి.పి.ఎస్ సెల్ నందు విధి నిర్వహణలో గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉండి దీర్ఘకాలంగా పరారీలో ఉన్న ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు.