Freebies Politics :  దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత పథకాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ప్రభుత్వాలు కూడా ఈ అంశంపై అఫిడవిట్లు దాఖలు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అధికారంలో ఉన్న పార్టీలు తాము ఇస్తున్నవి ఉచితాలు కాదని సంక్షేమం అని వాదించాయి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఉచితాలకు.. సంక్షేమానికి తేడాని నిర్వచించలేమని స్పష్టం చేసింది. మరి ఈ విషయంలో ఎవరు ముందడుగు వేయాలి ?


ఉచిత పథకాలు దేశానికి హానికరమని ప్రధాని మోదీ ఆందోళన !


ఉచిత పథకాలు దేశానికి హానికరమని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని కూడా పట్టించుకోకుండా ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయని.. విపరీతంగా అప్పులు చేస్తూ.. ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకుంటూ భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నారని ఆర్థిక నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణ అందర్నీ ఆకర్షించింది. కానీ ఉచిత విద్య, వైద్యం ఇవ్వడం కూడా ఉచితాల కిందకే వస్తుంది. అలాంటి వాటిని ఎలా తప్పు పట్టగలమని సుప్రీంకోర్టు వాదన. అందకే ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. 


చట్టాలు.. తీర్పుల వల్ల ఉచిత పథకాలు ఆగవు ! 


ఉచిత పథకాలు వద్దని చట్టాలు చేయడం వల్ల కానీ.. అలా ఇవ్వవద్దని కోర్టులు చెప్పడం వల్ల కానీ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే.. రాజకీయ పార్టీల చేతుల్లోనే ఈ ఉచిత పథకాల అమలు ఉన్నాయి.  చట్టం చేస్తే అది చట్టంలాగానే ఉంటుంది.. కానీ ఆలోచనల్లో మార్పు వస్తే మాత్రం అది ఆచరణలోకి వస్తుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు  ప్రభుత్వం ప్రజల సొమ్ముతో వారి ఓట్లు కొనేందుకు ఉచిత పథకాలను రంగంలోకి తెసన్నాయి.  ఇప్పుడు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు అమలు చేస్తోంది.  చాలా రాష్ట్రాలు బడ్జెట్‌ను కూడా మించిపోయి.. అప్పులు చేసి మరీ పంచుతున్నాయి. ఇలా ఇవ్వడం వల్ల సమస్యలేనని ఆ పార్టీలకూ తెలుసు. కానీ రాజకీయం కోసం తప్పడం లేదు. ఇప్పుడు ఆ పార్టీలు మారితే ఉచిత పథకాలు ఆగిపోవా ? 


సంక్షేమం ఏదో..  ఉచిత పథకం ఏదో పార్టీలకు తెలియదా ?


 ప్రజలకు కావాల్సింది ఉపాధి, నాణ్యమైన సరుకులు, మేలు రకం ఎరువులు, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య.. అంతే కానీ ఉచిత పధకాలు, తాయిలాలు కావు. ఇటీవల రాజకీయ పార్టీలు పేద ప్రజలకు మేలు చేయవద్దా అని వాదిస్తూ ఉంటారు. పెద్దలకు లక్షల కోట్లు మాఫీ చేయవచ్చు కానీ పేదలకు ఉచిత బియ్యం.. విద్య.. వైద్యం ఇవ్వకూడదా అని ప్రశ్నిస్తున్నారు.   దేశంలో ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ ఇస్తున్నారా అంటే ఆలోచించాల్సిందే.  ఈ విషయం రాజకీయ నాయకులకు తెలియదా.. అంటే.. తెలియకుండా ఎలా ఉంటుంది… అన్నీ తెలిసే చేస్తున్నారు.  రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపే ముఖ్యం.  ఇప్పుడు నేరుగా నగదు బదిలీ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. చివరికి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కూడా నగదే ఇస్తామంటున్నారు. కిలో రెండుకు ఇచ్చే బియ్యానికీ డబ్బులే ఇస్తామంటున్నారు. అంటే.. అసలు ఆయా పథకాల ఉద్దేశం ఏమిటో కూడా గుర్తించడానికి సిద్ధంగా లేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


ప్రజలు ఉచితాలకు అలవాటు పడితే యువతకు నష్టం ! 


తాము సంపాదించుకుంటే వంద రూపాయలు వస్తాయంటే… సంపాదించుకోవడం మానేసి ఉచితంగా వస్తాయంటే పది రూపాయల కోసం పది గంటలు క్యూలో నిల్చోవడానికి సిద్ధపడేలా సమాజాన్ని ఇప్పటికే మార్చేశారు. ఇంకా ఇంకా మారుస్తున్నారు. ఇది దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తుంది.  అందుకే  ముందుగా రాజకీయ నేతల ఆలోచనల్లో మార్పు రావాలి. ఉచితాల గురించి ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మార్పు వస్తుంది.