Minister Damodar Raja Narasimha Facebook Page Hacked: సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్ సైట్స్, ఫేక్ లింక్స్ సృష్టించి డబ్బులు దండేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఫేస్ బుక్ పేజీనే హ్యాక్ చేశారు. తాజాగా, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి వేరే పార్టీలకు చెందిన పోస్టులు చేశారు. ఆయన ఫేస్ బుక్ పేజీలో బీజేపీ, టీడీపీ, తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు వందల సంఖ్యలో దర్శనమిచ్చాయి. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాకయ్యారు.
'ఇలా పెట్టారేంటి సార్.?'
ఆ ఫోటోలను చూసిన కొందరు నాయకులు విషయం తెలియక నేరుగా మంత్రి దామోదరకు ఫోన్ చేసి.. 'మీ ఫేస్ బుక్ లో పోస్టులు ఏంటి సార్ అలా పెట్టారు.?' అని ప్రశ్నించారు. విషయం తెలియని ఆయన.. అన్నీ మా పార్టీకి సంబంధించినవే ఉన్నాయి కదా అని చెప్పారు. దీంతో ఆ పేజీలో వేరే పార్టీలకు చెందిన పోస్టులు ఉన్నాయని.. అవి కనెక్ట్ అయిన వారందరికీ వెళ్తున్నట్లు ఆయన దృష్టికి తెచ్చారు. అప్రమత్తమైన మంత్రి.. తన ఫేస్ బుక్ పేజీ పరిశీలించగా వేరే పార్టీల పోస్టులు చూసి షాక్ అయ్యారు. వెంటనే తన ఫేస్ బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేశారని అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు హ్యాకర్లను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా, తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని మంత్రి కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ దావోస్ పర్యటన - భారీ పెట్టుబడులే లక్ష్యం