Hindupuram Politics: తెలుగుదేశం పార్టీ కంచుకోటను బద్దలు కొట్టాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఆపరేషన్ హిందూపూర్ కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజులపాటు ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గంలోనే మకాం వేశారు. మునుపెన్నడూ లేని విధంగా హిందూపురం నియోజకవర్గంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీల నాయకులు కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధిష్టానం కూడా నియోజకవర్గంలో భారీ మార్పులు చేస్తూ వస్తుంది.. హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ను తప్పించి దీపిక రెడ్డిని నియమించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు దీపికా రెడ్డి  పర్యటిస్తున్నారు. 


నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సీపీ నేతలను కార్యకర్తలను కాకుండా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నటువంటి నేతలకు ఈ పర్యటనలో ఎరవేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్పుతో నవీన్ నిచ్చల్  ఈసారైనా తనకు అవకాశం కల్పిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. అధిష్ఠానం అనూహ్యంగా ఇంచార్జ్ గా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ను తప్పించి రెడ్డి అనే మహిళకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. మనస్తాపానికి గురైన నవీన్ నిచ్చల్  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనకు దూరంగా ఉంటూ వచ్చారు. 


అంతర్గత కలహాలు దూరం


ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలిపించుకొని నవీన్ నిచ్చల్ తో చర్చించారు. నియోజకవర్గంలో తనకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద నవీన్ తన ఆవేదంలో వ్యక్తం చేశాడు. ఎన్నికల అనంతరం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని నవీన్ నిచ్చల్ కి మంత్రి పెద్దిరెడ్డి హామీచ్చినట్టు సమాచారం. దీనితో ఆఖరి రెండు రోజులు హిందూపురంలో బలమైన క్యాడర్ ఉన్న నవీన్ నిచ్చల్ పెద్దిరెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. హిందూపురం నియోజకవర్గం లో వైఎస్ఆర్ సీపీ అంతర్గతంగా ఉన్న కలహాలను దూరం చేసి నియోజకవర్గ నేతలను ఏకతాటిపైకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకురావటంలో సఫలీకృతమయ్యారు. నవీన్ నిచ్చాల్ సైతం రానున్న ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేయడానికి అందరూ సమిష్టి కృషితో పని చేస్తామని బహిరంగ సభలో కూడా మాట్లాడటంతో హిందూపురం వైఎస్ఆర్ సీపీ నేతల్లో నూతనోత్సాహం నెలకొంది.


నియోజకవర్గంలో వారం రోజులు పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో పంచాయతీల వారీగా తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఎన్నికల సమయంలోపే వచ్చిన అర్జీలు అన్ని పరిష్కారం చేస్తామని అర్జీదారులకు మంత్రి హామీ ఇచ్చారు.


అద్దాల కోటని బద్దలు కొడతాం - పెద్దిరెడ్డి


ఈ పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున తెలుగుదేశంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని దృఢ సంకల్పంతోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వారం రోజులపాటు హిందూపురంలోనే మకాం వేశారని జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మంత్రి నియోజకవర్గంలో పర్యటించడం ఎక్కడా చూడలేదని నేతలు చెబుతున్నారు. హిందూపురం తెలుగుదేశం పార్టీకి అద్దాల కోట మాత్రమేనని ఈసారి కచ్చితంగా బద్దలు కొడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ నందమూరిపురాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు స్పష్టం అవుతుంది.


మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం ఎప్పుడు లేనంతగా నియోజకవర్గం మండలాల వారీగా నాయకులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పిలిపించుకొని బాలకృష్ణ మాట్లాడారు. అధికార వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు మాటలు నమ్మి మోసపోవద్దని సమీక్ష సమావేశాల్లో నేతలకు చెప్పినట్లు సమాచారం.