Nara Family sankranti celebrations: కుప్పం: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు భోగి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. అటు సీఎం జగన్ నివాసంలో కూడా భోగి సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగాయి. ఇటు ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం ఆయన మందడంలో పవన్ కల్యాణ్ తో కలసి భోగి మంటలు వేశారు. సాయంత్రం తన సొంత ఊరు నారావారి పల్లెకు చేరుకుని భోగి వేడుకల్లో సందడి చేశారు. 




నారావారిపల్లెలో సందడే సందడి..
ప్రతి ఏటా నారావారి పల్లెలో నారా, నందమూరి కుటుంబాలు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది కూడా నందమూరి, నారా కుటుంబ సభ్యులు నారావారి పల్లెకు చేరుకున్నారు. ఉదయాన్నే భోగి మంటలు వేసి సందడిగా గడిపారు. నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, లోకేశ్వరి తదితరులు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతుల్ని భోగి మంటల్లో వేశారు నందమూరి రామకృష్ణ. 




నారావారిపల్లెలో ముగ్గుల పోటీలు 
భోగీ పండగ సందర్భంగా నారావారిపల్లెలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వసుంధర, తేజస్విని వారిని ఉత్సాహ పరిచారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రతి ఏటా చంద్రబాబు సంక్రాంతి పండగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వస్తారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఇక్కడే పండగ జరుపుకుంటారు. పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు. శనివారమే కుటుంబ సభ్యులంతా నారా వారి పల్లెకు చేరుకున్నారు. ఈ రోజు నుంచి సంబరాలు మొదలయ్యాయి. 






సాయంత్రానికి నారావారి పల్లె చేరుకున్న చంద్రబాబు, లోకేష్ 
ఉదయాన్నే కుటుంబ సభ్యులు భోగి పండగ సంబరాల్లో పాల్గొనగా.. చంద్రబాబు లోకేష్ సాయంత్రానికి నారావారి పల్లె చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులు, స్థానికులతో వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. సంప్రదాయ దుస్తుల్లో వారు జనంలోకి రావడంతో స్థానికులు వారిని చూసేందుకు, మాట్లాడేందుకు ఉత్సాహం చూపించారు. ప్రతి ఏడాదీ చంద్రబాబు కుటుంబం నారావారి పల్లెకు వస్తున్నా.. వారిని కలిసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా నారా వారి ఆధ్వర్యంలో జరిగే వేడుకలను చూసేందుకు వస్తుంటారు. దీంతో నారావారి పల్లెలో సందడి నెలకొంది.