AP Congress Big Target: మరో 2 నెలల్లో జరగనున్న ఏపీ(AP) అసెంబ్లీ(Assembly) ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. 2014కు ముందు జరిగిన రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న అనేక నియోజకవర్గాల్లో పార్టీ నిర్వీర్యం అయిపోయింది. నాయకుల(Leaders) కన్నా.. ప్రజలే కాంగ్రెస్‌ను వదులుకున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీని నాశనం చేశారన్న వాదన బలంగా వినిపించింది. దీంతో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.
మారుతున్న రాజకీయం
ఇక, ఓటు బ్యాంకు విషయానికి వస్తే.. 1 శాతం ఓటు (Vote) బ్యాంకును కూడా కాంగ్రెస్ గత ఎన్నికల్లో దక్కించుకో లేకపోయింది. ఈ పరిణామంతో రాష్ట్రంలో ఇక కాంగ్రెస్(Congress) పార్టీ లేదనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు సంతరించుకుంటున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) సానుభూతిని, ఆయన ఇమేజ్‌ను ఇప్పటి వరకు అధికార పార్టీ వైసీపీ వినియోగించుకుంటోంది.
జెండా.. అజెండా..
పార్టీ జెండా నుంచి అజెండా వరకు వైసీపీ(YCP) వైఎస్ నామస్మరణ చేసింది. ఫలితంగా వైఎస్ సానుభూతి పరంపర మొత్తం వైసీపీకి కలిసివచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్‌కు కంచుకోటల వంటి 29 ఎస్సీ(SC) నియోజకవర్గాలు, 7 గిరిజన రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లోనూ వైసీపీ పాగా వేసే పరిస్థితి వచ్చింది. గత 2019 ఎన్నికల్లో రెండు ఎస్సీ(కొండపి Kondapi, రాజోలు Rajole) మినహా.. మిగిలిన 27 ఎస్సీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. ఇవన్నీ.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు కావొచ్చు.. దివంగత వైఎస్ ఇమేజ్ కావొచ్చు.. ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు ఆ పార్టీకి అండగా ఉన్నారు.
ఈ నియోజకవర్గాలే కీలకం
అయితే.. అవన్నీ తర్వాత కాలంలో వైసీపీకి దఖలు పడ్డాయి. ఇక, రెడ్డి(Reddy), కాపు(Kapu) సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, కడప, విశాఖల్లోనూ కాంగ్రెస్ బలంగా ఉండేది. కానీ, రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావంతో ఈ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కొట్టుకుపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఇవే నియోజకవర్గాలు ఆలంబనగా.. కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. పోయిన నియోజకవర్గాల్లో ప్రాబల్యం పెంచుకోవడం.. వైఎస్(YS) చరిష్మా(Image)ను తమకు అనుకూలంగా మార్చుకోవడం.. వైఎస్‌ను తమవాడిగా ప్రచారం చేసుకోవడం.. వంటివి కాంగ్రెస్‌కు ప్రధాన అస్త్రాలుగా మారనున్నాయి.
వాటిపైనే ఎక్కువ ఫోకస్
ఈ క్రమంలోనే ఏమీ లేనిచోట ఎగిరెగిరెగిరి పడడం కంటే.. ముందుగా నెమ్మదిగానే అడుగులు వేయాలని.. అయితే.. ఆ అడుగులు అత్యంత కీలకంగా ఉండాలని కాంగ్రెస్(Congress) నిర్ణయించింది. దీనిలో భాగంగానే తాజా గా ఏపీపై కీలక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 20 - 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలన్నది ఈ మాస్టర్ ప్లాన్. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టడం కంటే.. కూడా 20-30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తోంది.
కింగ్ మేకర్
తద్వారా.. ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వానికి కింగ్ మేకర్‌గా అవతరించాలనేది కాంగ్రెస్ పార్టీ పెద్దల వ్యూహంగా ఉంది. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ పగ్గాలు చేపట్టనున్న వైఎస్ తనయ, వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పెద్దలు నూరిపోశారు. ఆదివారం.. మణిపూర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో న్యాయ యాత్రను(Bharat Jodo Nyay Yatra) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్ తదితరులు.. షర్మిల సహా ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంలకు.. ఈ కింగ్ మేకర్ లక్ష్యాన్ని తేల్చిచెప్పారు.
సక్సెస్ అయ్యేనా?
కాంగ్రెస్‌కు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని ముందు బలోపేతం చేయాలని.. గెలుస్తారనుకున్న వారికి టికెట్ ఇచ్చేందుకు వెనుకాడవద్దని.. అదే సమయంలో వైఎస్ సెంటిమెంటును తమవైపు తిప్పుకొనేందుకు ఎంతటి ప్రయత్నమైనా చేయాలని వారు తేల్చి చెప్పారని సమాచారం. మొత్తంగా ఏపీలో 20 - 30 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వంలో పాత్ర పోషించగలిగితే.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తిస్థాయిలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యూహం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.