Global Spiritual Mahotsav in Hyderabad: కేంద్ర పర్యాటక శాఖ, హార్ట్ ఫుల్ నెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 'గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్' నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఈ నెల 14 నుంచి 17 వరకూ ఈ కార్యక్రమం జరగుతుందని చెప్పారు. భారతదేశం అంటేనే సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తి అని.. భారత్ స్పూర్తితో యావత్ ప్రపంచం ప్రభావితమవుతోందని అన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని.. 16న జరిగే కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ హాజరవుతారని తెలిపారు. అలాగే, ముగింపు రోజున ప్రపంచ ప్రఖ్యాత గురువులతో సమాలోచనలు జరుగుతాయని పేర్కొన్నారు. భారతదేశం  హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు పుట్టినిల్లని.. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ద్వారా శాంతిని బోధిస్తున్నాయని అన్నారు. కరోనా అనంతరం ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హార్ట్ ఫుల్ నెస్ గైడ్ కమలేష్ డి పటేల్, త్రిదండి చినజీయర్ స్వామి, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పాల్గొన్నారు.


Also Read: Biramalguda Flyover: బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ - అభివృద్ధి అడ్డుకుంటే నగర బహిష్కరణ తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు