Telangana Minister Konda Surekha: పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడ (Pashamailaram Industrial area)లో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రారంభించారు. పటాన్ చెరు (Patancheru) మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో 104.24 కోట్ల రూపాయలతో (common effluent treatment plant) వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారు. స్పీకర్ తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ కలిసి ఈ శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, TSIIC ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాశమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


రాంకీ ప్రైవేట్ సంస్థ ఒప్పందం 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మరియు వివిధ పరిశ్రమల సహకారంతో PPP భాగస్వామ్యంతో నిర్మించారు. రాంకీ ప్రైవేట్ సంస్థ కాలుష్య నియంత్రణ మండలితో ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్మా, కెమికల్ రసాయనాలు తయారు చేసే సుమారు 60 రసాయన పరిశ్రమలకు రక్షణగా ఉంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. పాశ మైలారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన 3 ఫైర్ స్టేషన్ లను ప్రభుత్వ ఆధీనంలో చేసుకొని అదనపు స్టాప్ ను నియమించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పారిశ్రామికవేత్తలు చేసిన సూచనల మేరకు ప్రతినెల రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు.


యాజమాన్యాలు కార్మికులను కాపాడుకోవాలి: మంత్రి కొండా సురేఖ


పరిశ్రమల్లో కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉందని కొండా సురేఖ అన్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా మొదటిసారిగా ఇంత పెద్ద సీఈటీపీ ప్లాంట్ ప్రారంభించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ ప్లాంటుకు మొత్తం రూ.104 కోట్లు ఖర్చు కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రూ.25 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో ప్రస్తుతానికి సగం నిధులు రూ.12.5 కోట్లు విడుదల అయ్యాయని, త్వరలోనే మిగతా నిధులను విడుదల చేస్తామన్నారు. పరిశ్రమల్లో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం అధునాతన టెక్నాలజీ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపిందన్నారు.


ఇందిరా గాంధీ హయాంలో పాశమైలారంలో పరిశ్రమల స్థాపన 
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పాశమైలారంలో పరిశ్రమల స్థాపన మొదలైందని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. కానీ మైనింగ్, పారిశ్రామిక రంగం వల్ల కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుందని చెప్పారు. అయితే పరిశ్రమల కోసం ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాల్లో కమర్షియల్ బిల్డింగులు కట్టకూడదని సూచించారు. నెంబర్ వన్ శుద్ధి ప్లాంట్ పాశమైలారంలో ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. గత ప్రభుత్వానికి భిన్నంగా తాము కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు.


Also Read: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాస - కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, ఎక్కడంటే?