CM Revanth Reddy Inaugurated Biramalguda Second Level Flyover: గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా మరో కీలక ముందడుగు పడింది. ఎల్బీనగర్ (LB Nagar) పరిధిలోని బైరామల్ గూడ రెండో లెవల్ ఫ్లై ఓవర్ తో పాటు లూప్ ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం)లో భాగంగా ఈ వంతెనల పనులు పూర్తి చేశారు. దాదాపు రూ.148.05 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పై వంతెన వల్ల.. శంషాబాద్, ఓవైసీ ఆస్పత్రి నుంచి బీఎన్ రెడ్డి నగర్, నాగార్జున సాగర్ వైపు వెళ్లే వాహనాలకు, చింతలకుంట చెక్ పోస్ట్ అండర్ పాస్ మీదుగా హయత్ నగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులకు ఉపయోగపడనుంది. అలాగే, నల్గొండ, వరంగల్ ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సదుపాయం కలుగుతుంది. ఇదే కూడలిలో ప్రస్తుతం 2 లూప్స్ నిర్మాణంలో ఉండగా పై వంతెన అందుబాటులోకి వచ్చింది. ఫ్లైఓవర్ మొత్తం పొడవు 1786.60 మీటర్లు కాగా.. వయాడక్ట్ భాగం పొడవు 1305.60 మీటర్లు, ర్యాంపుల పొడవు 481 మీటర్లుగా ఉంది.
సిగ్నల్ ఫ్రీగా కూడలి
ఈ వంతెన ప్రారంభంతో బైరామల్ గూడ కూడలి సిగ్నల్ ఫ్రీగా మారింది. శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ ఆస్పత్రి వైపు నుంచి నాగార్జునసాగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఈ పై వంతెన ఉపయోగపడుతుంది. జంక్షన్ లో ఈ వంతెన 'వై' ఆకారంలో విడిపోతుంది. వంతెనకు ఎడమవైపు వెళ్తే చింతలకుంట చెక్ పోస్ట్, కుడి వైపు వెళ్తే బీఎన్ రెడ్డినగర్ రోడ్డుకు కలుస్తాయి.
'అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'
హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 'మూసీ నది మురికి కూపంగా మారడంతో జనం అనారోగ్యాల బారిన పడుతున్నారు. నగరంలో మూసీ కాలుష్యం నల్గొండ జిల్లాలోని 50 వేల ఎకరాలను కలుషితం చేస్తోంది. మూసీ అభివృద్ధికి టెండర్లు పిలిచాం. రూ.50 వేల కోట్లతో మూసీని ఆధునీకరిస్తాం. మాస్టర్ ప్లాన్ అందగానే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాం. వైబ్రంట్ తెలంగాణ 2050కి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం వచ్చాయి. వాటితో ఎన్నో కంపెనీలు రావడంతో తెలంగాణకు మంచి గుర్తింపు వచ్చింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్ఎండీఏ పరిధిలోకి తెస్తాం. భవిష్యత్తులో నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుతో (ఆర్ఆర్ఆర్) తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే వందేళ్లు గొప్ప నగరంగా ఉండేలా భాగ్య నగరాన్ని తీర్చిదిద్దుతాం.' అని రేవంత్ స్పష్టం చేశారు.
'వారికి నగర బహిష్కరణే'
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 'కొడంగల్ లో చేదు అనుభవం ఎదురైనా మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేశాను. ఎల్బీనగర్ నియోజకవర్గం నాకు 30 వేల మెజార్టీ ఇచ్చి ప్రజా గొంతుకను ఇచ్చింది. ఇక్కడకు ఎప్పుడు వచ్చినా నా గుండె వేగం పెరుగుతుంది. మెట్రో రైలును విస్తరిస్తూ ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ తీసుకెళ్తాం. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో రాబోతోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మాపై ఉంది. హైదరాబాద్ లో మెట్రో విస్తరణ అడ్డుకోవాలని చూసేవారిని ఈ వేదికగా హెచ్చరిస్తున్నా. హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డుపడొద్దు. అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తున్న వారికి నగర బహిష్కరణ తప్పదు.' అంటూ వ్యాఖ్యానించారు.