GHMC Council Meeting 2024: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం (GHMC Meeting) సోమవారం వాడీవేడీగా సాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల నినాదాలతో గందరగోళం నెలకొంది. గతంలో ఫిక్సుడ్ డిపాజిట్లు ఉన్న జీహెచ్ఎంసీ ప్రస్తుతం అప్పుల పాలైందని.. ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. దీనిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. అటు, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని.. కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. మేయర్ విజయలక్ష్మి పోడియంను చుట్టుముట్టి తమకూ మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఆమె నచ్చచెప్పేందుకు యత్నించినా వినలేదు. చివరకు మైక్ ఇస్తానని చెప్పడంతో వారు శాంతించారు.


అధికారులపై అసంతృప్తి


ఈ సందర్భంగా అన్ని పార్టీల కార్పొరేటర్లు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తమ డివిజన్లలోని సమస్యలను మేయర్ దృష్టికి తెచ్చారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చొని సంతకాలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షించాలని బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు హితవు పలికారు. వీరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు సైతం మద్దతు తెలుపుతూ.. అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి దీపాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో డిప్యూటేషన్ పై చాలామంది అధికారులు ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చొంటున్నారని బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ విమర్శించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ రోనాల్డ్ రాస్.. 312 మంది అధికారులు డిప్యూటేషన్ పై ఉన్నారని, 45 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారని.. వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 


మేయర్ ఆగ్రహం


అటు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైతం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా జోనల్ స్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలసత్వం చూపే అధికారులను వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ జీహెచ్ఎంసీ పాలక మండలి తీర్మానం చేసింది.


Also Read: Revanth Reddy: హస్తినకు సీఎం రేవంత్, కేబినెట్ విస్తరణకు వేళాయే