Vizag News: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార వైసీపీకి బైబై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ నగర పరిధిలోని ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ఆయన విమర్శలు గుప్పించారు. గడిచిన ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేశాడని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి కోరం లేక అసెంబ్లీ వాయిదా వేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. జగన్ ఢిల్లీకి వెళ్తే కనీసం ముగ్గురు ఎంపీలు కూడా ఆయన వెంట లేరని, సీఎం జగన్ పాలన పట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు కాకుండా ప్రజలు కూడా విసుగెత్తిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బైబై చెప్పాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. 


ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభం


కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం ద్వారా పాలన ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎంతో సమయం పట్టదన్నారు. ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని మరో ప్రభుత్వం కూల్చివేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని గంటా పేర్కొన్నారు. 900కిపైగా హామీలు ఇచ్చి, 15 శాతం కూడా నెరవేర్చలేదని, మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్.. రానున్న ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖ ఒకప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉండేదని, 2014-19 హుద్ హుద్ సమయంలో చంద్రబాబు ఇక్కడే ఉండి పాలన సాగించి ప్రజలకు అండగా నిలిచారన్నారు. అటువంటి గొప్ప నగరాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రైమ్ క్యాపిటల్ గా మార్చేశారని గంటా దుయ్యబట్టారు. మధురవాడలోని ఒక అపార్ట్ మెంట్ లో ఎమ్మార్వో రమణయ్య దారుణంగా చంపేశారని, అధికారులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని గంటా పిలుపునిచ్చారు. 


తెలుగుదేశం జనసేన పార్టీల కాంబినేషన్ సూపర్ హిట్


రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న తెలుగుదేశం, జనసేన పార్టీలది సూపర్, డూపర్ హిట్ కాంబినేషన్ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసిపిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ కు గంటా అభినందనలు తెలియజేశారు. అన్న ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినపుడు అంతా అవహేళన చేశారని, తర్వాత ఆయన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు. భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ నిధిని లోకేష్.. టిడిపి కేడర్ కోసం ప్రవేశపెట్టారన్నగంటా.. పార్టీని కొత్తపుంతలు తొక్కిస్తున్నారంటూ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడు ఉన్నాడని లోకేశ్ నిరూపించారని వెల్లడించారు. ఎన్నికల మ్యాచ్ లో లాస్ట్ మూడు ఓవర్లు మాత్రమే కాదని, లాస్ట్ బాల్ కూడా ఎంతో కీలకమైనదన్నారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా గంటా కోరారు.