Telangana CM: తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళుతున్నారు.  సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు. నేడు సాయంత్రం పార్టీ అధిష్టాన పెద్దలతో భేటీ కానున్నారని తెలుస్తోంది.  లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రేవంత్ హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకునే దిశగా టీ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించే అవకాశముంది. 


అలాగే ఎంపీ అభ్యర్థుల జాబితాపై కూడా  పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరపనున్నారు. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికలకు ముందు నామినేటెడ్ పోస్టులతో పాటు మంత్రివర్త విస్తరణ చేపట్టాలని రేవంత్ భావిస్తున్నారు. దీంతో వాటిపై పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే పదవుల భర్తీ చేపట్టనున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చోటు లేదు. దీంతో ఆ జిల్లాల వారికి ఈ సారి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో అవకాశం కల్పించే అవకాశముంది. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ కేబినెట్ బెర్త్ కోసం పోటీ పడుతున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. రేవంత్ ఢిల్లీ టూర్ తర్వాత మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానుంది.


ఫిబ్రవరి చివరిలోపు మరో రెండు గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌తో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ లేదా ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించే అవకాశముంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా తయారుచేశారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. దీంతో అర్హుల జాబితాను తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ పనిని విద్యుత్ శాఖ అధికారులకు అప్పగించారు. గత కొద్ది రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారి వివరాలను నమోదు చేస్తున్నారు. వారిలో రేషన్ కార్డు ఎంతమందికి ఉందనే వివరాలను క్రోడీకరిస్తున్నారు.


విద్యుత్ శాఖ అర్హులను గుర్తించిన అనంతరం ఆ వివరాలను ప్రభుత్వానికి పంపనుంది. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిపై అధిష్టానం పెద్దలకు రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అధిష్టానం సూచనల మేరకు పథకాలు ప్రవేశపెట్టనున్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తైంది. దీంతో ఆరు గ్యారెంటీల అమలుపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. పార్లమెంట్ ఎన్నికల్లోపు మిగతా పథకాలను అమలు చేయడంపై దృష్టి సారించింది.