Quora Viral Question: ‘మా అబ్బాయి అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నాడండీ. కానీ అక్కడ ఖర్చులు కూడా అలానే ఉంటాయిగా. అమెరికాలో సొంత ఇల్లు, కారు లేకపోతే బతకలేరంటండీ.’ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల గురించి ఇక్కడ తల్లిదండ్రులు డబ్బా కొట్టడం మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలు విన్నవారిలో కొంతమంది విని ఊరుకుంటారు, కొంతమంది అవునా అని ఆశ్చర్యపోతారు. కొంతమంది మాత్రం ఇంట్లో ఉన్న పిల్లలని ఆడేసుకుంటూ ఉంటారు. పాపం బెంగళూరు ఉన్న ఒక ఇంజినీరుకు ఇలా డబ్బా కొట్టేవాళ్లు ఎవరూ లేరేమో తన డబ్బా తానే కొట్టేసుకుందామని ఫిక్స్ అయ్యాడు. వెంటనే ‘కోరా’ ప్లాట్‌ఫాంలో ఒక క్వశ్చన్ పడేశాడు. ఆ ప్రశ్న అప్పటి నుంచి ఇంటర్నెట్‌ను తగలబెట్టేస్తూనే ఉంది. ఇంతకీ అదేం ప్రశ్న....


‘బెంగళూరులో 32 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి సంవత్సరానికి 94.1 లక్షల జీతం చాలా తక్కువ అవుతుందా?’ అని అడిగాడు. అంతే నెటిజన్లకు కాలింది. తమ సమాధానాలతో క్వశ్చన్ వేసినోడిని తగలెట్టేశారు. ఒక్కో రిప్లైని ఒక్కో డైమండ్ అనేయచ్చు.


సిటీలో సరిపోవు బ్రో..
ఈ ప్రశ్నకు శుభం పఠానియా అనే నెటిజన్ ‘మరీ తక్కువ అని చెప్పను కానీ కాస్త తక్కువే. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయితే నువ్వు బెంగళూరులో బతికే అవకాశం ఉంది. వాటిలో మొదటిది ఏంటంటే ఆఫీస్‌కు హెలికాఫ్టర్‌లో వెళ్లే బదులు లగ్జరీ కారు కొనుక్కో. ఒక హౌసింగ్ సొసైటీ మొత్తం కొనే బదులు ఒక అపార్ట్‌మెంట్ కొంటే సరిపోతుంది. ఇంటికి దగ్గరలో స్కూల్ కట్టుకునే బదులు పిల్లలని దగ్గరలో ఉన్న స్కూలుకి పంపడం మంచిది. ఇంట్లో సరుకుల కోసం డీమార్ట్ అవుట్‌లెట్ మొత్తం కొనేయకుండా అవసరమైన వస్తువులు కొంటే సరిపోతుంది. దీపావళికి డబ్బు కట్టల బదులు టపాసులు కాల్చండి. ఎప్పుడైనా సినిమా చూడాలనిపిస్తే దాని కోసం థియేటర్ కట్టించుకోకుండా దగ్గర్లో ఉన్న థియేటర్‌కు పోతే సరిపోతుంది. ఈ జీతంతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి.’ అని రిప్లై ఇచ్చాడు. దీనికి ఏకంగా 2.9 మిలియన్ వ్యూస్, దాదాపు ఐదు వేల వరకు లైకులు వచ్చాయి.


సౌరబ్ బెనర్జీ అనే మరో యూజర్ అయితే ‘ద్యావుడా... నేనింకా షాక్‌లోనే ఉన్నానయ్యా. ఇన్ని సంవత్సరాలుగా అంత తక్కువ ఇచ్చే కంపెనీ నుంచి బయటకు రాకుండా ఎలా బతుకుతున్నావు బ్రో. వెంటనే జాబ్‌కి రిజైన్ చేసి మరో కంపెనీలో 300 శాతం హైక్ తీసుకో. నీకు ఇంకా మెరుగైన జీతం రావాలి. నీ వయసు వారందరూ అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. దయచేసి నీ ఉద్యోగం మానేసి సంవత్సరానికి రూ.94.1 కోట్లు ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగాన్ని వెతుక్కో.’


‘సంవత్సరానికి రూ.94.1  లక్షల ప్యాకేజీతో నువ్వు బెంగళూరులో గాలి కూడా పీల్చలేవు. బెంగళూరు సాధారణ జీవితం గడపాలన్నా సంవత్సరానికి రూ. 94.1 కోట్ల ప్యాకేజీ కావాలి. రూ.100 కోట్ల పైన జీతం అయితే ఇంకా మంచిది. బెంగళూరు ఒక అండర్‌వేర్ కొనాలంటేనే రూ.50 లక్షలు ఖర్చవుతుంది. అంటే నీ జీతంతో నువ్వు సంవత్సరానికి రెండు అండర్‌వేర్లు మాత్రమే కొనగలవన్న మాట. మిగతా ఖర్చులన్నిటికీ నువ్వు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు చేస్తున్నావా? అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావు బ్రో? నీకు అంత తక్కువ ప్యాకేజీ ఇస్తున్న కంపెనీ ఏది? ఇంత కాస్ట్లీ సిటీకి ఎలా వచ్చి పడ్డావు?’ అని ఇచ్చి పడేశాడు.


కానీ వాత పెట్టి వెన్న పూసినట్లు వెంటనే హితోపదేశం కూడా చేశాడండోయ్. ‘బెంగళూరు 30 నుంచి 35 సంవత్సరాల సగటు వయస్సు గల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సగటు వార్షిక వేతనం రూ. 7 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంది. అది కూడా వారికి సరైన సమయంలో సరైన వయసులో మంచి ఉద్యోగం లభించినప్పుడు మాత్రమే.’ అని సమాధానం ఇచ్చాడు.


ఈ ప్రశ్నకు ఇప్పటికే 100కు పైగా సమాధానాలు వచ్చాయి. ఈ సమాధానాలన్నీ ఇలా ఫన్నీగానో, లేకపోతే పూర్తిగా తిడుతూనే వచ్చాయి తప్ప ఒక్కటి కూడా పాజిటివ్‌గా రాలేదు. కాబట్టి ఇంటర్నెట్‌లో షో ఆఫ్ చేయాలనుకునేటప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?