Whatsapp Backup New Rules: ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ గత ఏడాది తన నిబంధనలను మార్చింది. యూజర్లు గూగుల్ అకౌంట్‌లో చేసుకునే చాట్ బ్యాకప్‌ను త్వరలో కౌంట్ చేయనున్నట్లే కంపెనీ తెలిపింది. అంటే మీరు వాట్సాప్ బ్యాకప్ చేసినప్పుడు గూగుల్ ఖాతాలో సేవ్ అవుతుంది కదా. అది ఇప్పటివరకు ఎంత డేటా అయినా ఉచితంగా అయ్యేదన్న మాట. కానీ ఇకపై మీకు గూగుల్ ఖాతాలో లభించే 15 జీబీ డేటాలోనే వాట్సాప్ బ్యాకప్ కూడా కౌంట్ అవుతుంది. ఒకవేళ అక్కడ స్టోరేజ్ తక్కువగా ఉంటే మీరు అదనపు స్టోరేజ్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. అసలు ఈ గొడవే వద్దు అనుకుంటే చాట్ బ్యాకప్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ ఈ ఏడాది జులై నాటికి అందరికీ అమలు కానుంది.


కంపెనీ చాట్ బ్యాకప్ కోసం గూగుల్ ఖాతా స్టోరేజ్‌ను లెక్కలోకి తీసుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇది వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లతో జరుగుతోంది. మీరు బీటా వెర్షన్‌ని ఉపయోగిస్తుంటే, ఖచ్చితంగా చాట్ బ్యాకప్‌ని ఒకసారి చెక్ చేయండి. బీటా టెస్టర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.


మీరు చాట్ బ్యాకప్ కోసం డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే, దాన్ని ఆఫ్ చేసుకోవచ్చు. మీ గూగుల్ ఖాతాలో మీకు స్టోరేజ్ ఉన్నప్పటికీ, చాట్ బ్యాకప్‌లో ఫోటో, మీడియా ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇవి స్టోరేజీని పూర్తిగా నింపుతాయి. ఇది కాకుండా మరో ఆప్షన్ ఏంటంటే, మీరు వాట్సాప్ ఛాట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఛాట్‌లు, డేటాను కొత్త ఫోన్‌కు బదిలీ చేయవచ్చు. ఇందుకోసం రెండు మొబైల్స్ వైఫై ఒకే నెట్‌వర్క్‌లో ఉండాలి. మీరు ఈ రెండు పద్ధతులను పాటించకపోతే, మీరు త్వరలో చాట్ బ్యాకప్ చేసుకోవాలనుకుంటే అందుకు చెల్లించాల్సి ఉంటుంది.


సాధారణ వినియోగదారులు ఈ అప్‌డేట్‌ను పొందడానికి 30 రోజుల ముందుగానే పాప్‌అప్ ఫారమ్‌లో మెటా ఈ మెసేజ్‌ను చూపుతుంది. అప్పటి నుంచి మీ వాట్సాప్ చాట్ బ్యాకప్ యూజర్ గూగుల్ అకౌంట్లో కౌంట్ అవుతుంది.


మరోవైపు వాట్సాప్ గత సంవత్సరం యాప్‌కు కమ్యూనిటీ ఆప్షన్‌ను యాడ్ చేసింది. దీని ద్వారా ఒక అంశంపై ఏర్పడిన వివిధ గ్రూపులను ఒకచోట చేర్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు స్టడీస్‌కు సంబంధించి మీ దాంట్లో నాలుగు గ్రూపులు ఉంటే, ఈ గ్రూపుల్లోని వ్యక్తులను ఒకే కమ్యూనిటీలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది అడ్మిన్ పనిని కూడా సులభతరం చేస్తుంది. అతను అప్‌డేట్స్‌ను ప్రతి గ్రూపులో మళ్లీ మళ్లీ పోస్ట్ చేయవలసిన అవసరం ఉండదు. కమ్యూనిటీ ఫీచర్ కింద ఒకరి డిటైల్స్ కూడా మరొకరికి కనిపించవు. ఇది ప్రైవసీని కూడా బాగా మెయింటెయిన్ చేస్తుంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!