తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 12 గ్రామాలు వివాదాస్పదంగా మారాయి. గత కొన్నేళ్లుగా ఆ గ్రామస్తులు తెలంగాణ మహారాష్ట్ర లో జరిగే ఎన్నికల్లో రెండు చోట్ల పాల్గొంటూ ఓట్లు వేస్తూ వస్తున్నారు.. ఓట్లు వేయడమే కాదు... వారికి రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు వర్తిస్తున్నాయి. రెండు రాష్ట్రాల పాఠశాలలు, రెండు రాష్ట్రాల ఇద్దరు సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని ఆధారాలు రెండు రాష్ట్రాల రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ ఇతర అన్ని పత్రాలు రెండు రాష్ట్రాలవి కలిగినవి ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని హక్కు పత్రాలు ఉన్నప్పటికీ వారిలో అభివృద్ధి మాత్రం ఏ మాత్రం కనిపించడం లేదు. వారి గ్రామాల్లో కనీస రోడ్డు సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేదు. కొంతమందికి తాతలకాలంగా భూములు సాగు చేస్తున్నప్పటికీ భూములకు పట్టాలు లేకపోవడంతో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు సౌకర్యాలు కోల్పోతున్నామని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు సార్లు ఓటింగ్
లోక్ సభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి అయితే ఆ గ్రామస్తులు మార్చి 19న రేపు ఓట్లు వేయబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలోను మే 13న జరిగే లోక్ సభ ఎన్నికల్లోను పాల్గొని ఓట్లు వేయబోతున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేస్తూ.. రెండు రాష్ట్రాల సౌకర్యాలు తీసుకుంటున్న ఆ గ్రామస్తులకు ఏం కష్టాలు ఉన్నాయి. ఇంతకి ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం.
1962 నుంచి ఈ గ్రామాల ఉనికి
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పరంధోలి గ్రామం ఇది. ఇది రెండు రాష్ట్రాలలోనూ ఉంది. తెలంగాణలోనీ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలో ఈ గ్రామం ఉండగా... అటూ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జీవితీ తాలూకాలో ఈ పరంధోలి గ్రామం ఉంది. ఈ పరంధోలి గ్రామంతో పాటు మొత్తం 12 గ్రామాలు ఇలాగే ఉన్నాయి. పరంధోలి తండా, ముక్కద్దంగూడ, కోటా, మహరాజ్ గూడ, శంకర్ లోద్ది, ఎస్సాపూర్, అంతాపూర్, బోలాపటార్, నారాయణగూడ, లెండిజాల, తదితర గ్రామాలున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఎస్సీ ప్రజలు నివసిస్తుండగా వారితో పాటు కొంతమేర ఎస్టీ ప్రజలు, బిసి ఇతరులు మరికొంత మంది నివసిస్తున్నారు. 1962 నుంచి ఈ గ్రామాలు ఉన్నాయి. 1970 నుంచి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు వేస్తూ వస్తున్నారు. అయితే అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. 1978లో రాష్ట్ర భూభాగ పునర్విభజనలో ఈ గ్రామాలని కలిపారు. అయితే 1980 నుంచి ఆంధ్ర రాష్ట్రం ఎన్నికలు నిర్వహిస్తుండగా పలుమార్లు ఈ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. ఆపై 1983 లో ఇరు రాష్ట్రాల నుంచి కొందరు వారదులు వచ్చి సముదాయించారు.
90ల్లో వివాదాలు
1993లో మహారాష్ట్ర ఎమ్మెల్యే వామన్ రావ్ చటప్ అధ్వర్యంలో ఆందోళన చేపట్టి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది గమనించిన ఆంధ్ర రాష్ట్రం..1995లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి ఎన్నికలు యథావిధిగా కొనసాగించారు. చివరికి ఇది సుప్రీం కోర్టుకు వెళ్లగా.. సుప్రీం కోర్టు ఇరు రాష్ట్రాల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరు జోక్యం చేసుకోవద్దని తెలపడంతో 1996 లో ఆంద్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు ఎన్నికలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎన్నికలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఈ 12 గ్రామాల ప్రజలకి రెండు రాష్ట్రాల సౌకర్యాలు ఆధారాలు, ఎన్నికలు అన్నీ ఉండగా కొంత అభివృద్ది మాత్రం శూన్యంగా ఉంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ఈ గ్రామ ప్రజలు నలిగిపోతున్నారు. రెండు రాష్ట్రాల సౌకర్యాలు తీసుకుంటున్న ఈ ప్రజలకు కనీస రోడ్డు సౌకర్యం, ఇతరత్రావి లేవు. రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 12 గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల సదుపాయాలను పొందడంతో పాటు రెండు రాష్ట్రాలలో కూడా ఓట్లు వేస్తున్నారు. ఇటీవలే విషయం తెలుసుకున్న ప్రభుత్వాలు రెండు చోట్ల ఓట్లు వేయొద్దని అధికారులతో ప్రచారం నిర్వహిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
రేపు మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కచ్చితంగా ఎన్నికల్లో ఓట్లు వేస్తామన్నారు ప్రజలు.. అలాగే మే 13న తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లోనూ పాల్గొని రెండు వైపులా కూడా ఓట్లు వేస్తామన్నారు. పాలక ప్రభుత్వాలు తమపై కేసులు పెడితే భయపడలేదని.. ముందు తమకు అభివృద్ధి చేసి తమని ఆదుకోవాలని కోరారు. ఈ 12 వివాదాస్పద గ్రామాల ప్రజలు అక్కడ పనిచేసిన స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు ఏబీపీ దేశంతో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.