తెలంగాణలో ఎన్నికల హడావిడి  మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. ఓటర్లను వలలో వేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయ్. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించిన  యంత్రాంగం వారు  తమ ఓటు హక్కు ను ఖచ్చితంగా వినియోగించుకొనేలా చూడటానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలో  హైదరాబాద్ (Hyderabad) నగరంలో  పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికను రూపొందించే ప్రయత్నం చేశారు ఎన్నికల అధికారులు.  గేటెడ్ కమ్యూనిటీలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తమ సంసిద్ధత ప్రకటించారు. తాజాగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections 2023) ఈ ప్రణాళికను ఉపయోగిద్దామని భావించారు. అయితే ఈ విషయంపై కొన్ని కమ్యూనిటీల ప్రతినిధులతో చర్చించినప్పుడు వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం,  ఈలోపే పోలింగ్ కేంద్రాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సిన సమయం ఆసనం అవడంతో అధికారులు ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.  ఈసారి కాకపోయినా వచ్చే ఏడాది మార్చి -ఏప్రిల్ లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అయినా సరే   గేటెడ్ కమ్యూనిటీలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి తీరుతామని రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఎన్నికల అధికారులు తెలిపారు.


గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు వీలుగా కేంద్రీయ ఎన్నికల సంఘం కొత్త కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఓటర్ల తొలగింపు, ఎన్నికల ఖర్చుపై నిఘా, ఓటర్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ లో ఏర్పాటు, సరిహద్దుల్లో చెక్ పాయింట్లు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు, వృద్ధుల కోసం పోస్టల్ బ్యాలెట్ వంటివి ఇందులో ఉన్నాయి. 


 సాధారణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1400 మంది ఓటర్లు మాత్రమే ఉండాలి. ప్రతి రెండు కిలోమీటర్ల దూరం కి ఒక బూత్ ఏర్పాటు చేయాలి. అయితే హైదరాబాద్ తో సహా ముంబై, ఢిల్లీ ,బెంగళూరు,  చెన్నై వంటి నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ల సంఖ్య పెరుగుతోంది. వీటిలో ఒక్కో దాన్లోనే 2000 మందికి పైగా ఓటర్లు ఉంటారు. కాబట్టి వీరందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలి అంటే ఆ గేటెడ్ కమ్యూనిటీ లోనే ఒక ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన.  అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రవీంద్ర నగర్ నియోజకవర్గాల్లో  రెండు వేలకు పైగా ఓటర్లు  ఉన్న 32  గేటెడ్ కమ్యూనిటీలను ఎన్నికల అధికారులు గుర్తించారు.  వాటిలో పోలింగ్ బూతుల ఏర్పాటు విషయంపై అక్కడి ప్రతినిధులతో చర్చించారు అయితే వీరంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఐటీ సంస్థల ఉద్యోగులు,  ఉన్నతాధికారాలు,  ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల విధులు నిర్వహిస్తున్న వారు ఇక్కడికి వచ్చే పోలీసులు,  ఎన్నికల అధికారులకు సేవలు ఎవరు చేస్తారని ప్రశ్నించారు. బిజీగా ఉండే తాము ఇక్కడికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించలేమని తేల్చి చెప్పారు. అయితే మరి కొందరు మాత్రం ఈ ఆలోచనపై ఉత్సాహం చూపించారు. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే ఒక కుటుంబం ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేసి అవకాశం కలుగుతుందని  కూడా వారు అభిప్రాయపడ్డారు. సుమారు 32 గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులతో మాట్లాడిన తరువాత  ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో మాత్రమే ఇప్పటివరకు పోలింగ్ బూత్ ఏర్పాటుకు అన్నిరకాలుగా అంగీకారం కుదిరినట్టు సమాచారం.