Frequent Accidents to Mla Lasya Nanditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్ వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెను ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు వెంటాడాయి. 2 ప్రమాదాల్లో ఆమె బయటపడినా.. మూడోసారి ప్రమాదంలో మృత్యువు కబళించింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2023, డిసెంబర్ 24న బోయిన్పల్లి వద్ద ఆమె లిఫ్ట్ లో చిక్కుకున్నారు. అక్కడ వీఆర్ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం లిఫ్ట్ లో కిందకు దిగుతుండగా అందులో చిక్కుకున్నారు. చాలామంది లిఫ్ట్ లోకి వెళ్లడంతో కొద్దిసేపటికి డోర్ తెరుచుకోలేదు. దీంతో లాస్య నందితతో పాటు పలువురు అందులోనే చిక్కుకుని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్ డోర్ బద్దలుకొట్టి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రెండో ప్రమాదం
ఆ తర్వాత ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో లాస్య నందిత పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో హోంగార్డుకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో లాస్య నందితతో పాటు ఆమె సోదరి, ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లాస్య నందిత తన సోదరితో కలిసి మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు.
వెంటాడిన మృత్యువు
నల్గొండ ప్రమాదం జరిగిన 10 రోజుల తర్వాత శుక్రవారం లాస్య నందితను మరో కారు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. గత ప్రమాదం తర్వాత ఆమె కొత్త కారు కొన్నట్లు సమాచారం. గురువారం సదాశివపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన లాస్య నందిత తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ సమీపంలో రెయిలింగ్ ను ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆమె పీఏ, డ్రైవర్ అయిన ఆకాశ్ తీవ్రంగా గాయపడగా.. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తు, అతి వేగమే కారు ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి పూర్తి స్దాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ ప్రస్థానం
దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. 1987లో హైదరాబాద్ లో ఆమె జన్మించారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య.. ఆ ఏడాది కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్ లో చేరారు. 2016 నుంచి 20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్ గా పని చేశారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
గతేడాది, ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి సాయన్న మృతి చెందారు. అనంతరం ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టిగా ప్రయత్నించినా.. మాజీ సీఎం కేసీఆర్ సాయన్న కుమార్తె నందితపైనే నమ్మకం ఉంచారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె బీఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి.. 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తె మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Also Read: Lasya Nanditha: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత - సీఎం రేవంత్, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి