CM Revanth And Kcr Condolence To Lasya Naniditha Death: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, మంత్రులు సైతం లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అటు, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందారని.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ సైతం లాస్య నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కేటీఆర్ దిగ్భ్రాంతి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'లాస్య నందిత చనిపోయారన్న విషాద వార్తతో నిద్రలేచా. గొప్ప నాయకురాలిగా ఎదుగుతున్న సమయంలోనే యువ ఎమ్మెల్యే చనిపోవడం బాధాకరం.' అంటూ ట్వీట్ చేశారు. ఇటీవలే ఆమె చేసిన ఓల్డ్ ట్వీట్ ను దీనికి జత చేశారు.
హరీష్ రావు పరామర్శ
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమేథా ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అటు, పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నారు. పటాన్ చెరు నుంచి గాంధీ ఆస్పత్రికి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఎమ్మెల్యే పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించనున్నారు. యువ ఎమ్మెల్యే మృతి చెందడంతో అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.