BRS Mla Lasya Nanditha Died in Road Accident: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతి చెందారు. పటాన్ చెరు (Patancheru) ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై సదాశివపేట నుంచి పటాన్ చెరు వస్తుండగా.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. పటాన్ చెరు అమేథా ఆస్పత్రికి లాస్య నందిత మృతదేహాన్ని తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.



అదే కారణమా.?


నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రెయిలింగ్ ను బలంగా ఢీకొని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకోనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


ఇటీవలే తప్పిన ప్రమాదం


కాగా, ఇటీవలే ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. ఇంతలోనే మరో ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. యువ ఎమ్మెల్యే మృతి చెందడంతో అటు బీఆర్ఎస్ వర్గాలు, ఇటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది.


ఇదీ రాజకీయ ప్రస్థానం


2016లో కవాడిగూడ నుంచి లాస్య నందిత కార్పొరేటర్ గా గెలిచారు. అయితే, 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి సాయన్న వెంటే ఉంటూ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతూ పట్టు సాధించారు. 2023, ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందడంతో ఆ స్థానం నుంచి లాస్య నందిత పోటీ చేశారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టిగా ప్రయత్నించినా.. మాజీ సీఎం కేసీఆర్ నందితపైనే నమ్మకం ఉంచారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 17,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇంతలోనే ప్రమాదంలో ఆమె మరణం అందరిలోనూ తీవ్ర విషాదం నింపింది. 


Also Read: Delhi liquor scam politics : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ హాట్ టాపిక్ అవుతుందా ? హఠాత్తుగా కవితకు నోటీసుల వెనుక కారణం ఏమిటి ?