The Boys Season 4 Release Date: అమెజాన్ ప్రైమ్‌లో ఎన్నో ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనదేశంలో కూడా పాపులర్ అయినవి కొన్నే. ఆ కొన్నిటిలోనే ముందు వరుసలో ఉండేది ‘ది బాయ్స్’. ఇప్పటికి మూడు సీజన్లుగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ రిలీజ్ డేట్‌ను అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ‘ది బాయ్స్’ నాలుగో సీజన్ జూన్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సిరీస్ విడుదల అవుతుంది.
దీనికి సంబంధించిన టీజర్ 2023 డిసెంబర్‌లోనే విడుదల అయింది. ‘ది బాయ్స్’ సిరీస్‌లో హోమ్‌ల్యాండర్ పాత్రలో ఆంటోనీ స్టార్ ప్రేక్షకులను అలరించనున్నాడు. కార్ల్ అర్బన్, ఎరిన్ మోరియార్టి, కరెన్ ఫుకుహారా కూడా కూడా ‘ది బాయ్స్ సీజన్ 4’లో కనిపించనున్నారు. ముందు సీజన్స్‌లాగానే ‘ది బాయ్స్ సీజన్ 4’లో కూడా ఆంటోనీ స్టార్ డామినేషన్ కనిపించనుందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. హాలీవుడ్ సిరీస్ లవర్స్‌కు నచ్చే యాక్షన్, కామెడీ లాంటి ఎలిమేంట్స్ ‘ది బాయ్స్ సీజన్ 4’లో ఉంటాయని టీజర్ ద్వారా తెలిసేలా చేసింది టీమ్.
ది బాయ్స్ బుక్ ఆధారంగా...
గార్త్ ఎన్నీస్ రాసిన ‘ది బాయ్స్’ అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు దర్శకుడు ఆడమ్ మెక్‌కే. కానీ ఆ తర్వాత పలు కారణాలు వల్ల ఈ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. దీంతో కొన్నాళ్ల వరకు ఆ స్క్రిప్ట్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2017లో ఈ కథను వెబ్ సిరీస్‌గా డెవలప్ చేస్తున్నారని తెలుసుకున్న అమెజాన్ స్టూడియోస్ దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది.
అలా ఎన్నో కష్టాలు ఎదుర్కున్న ఈ స్క్రిప్ట్ ఫైనల్‌గా ‘ది బాయ్స్’ అనే ఒక సిరీస్‌గా 2019 జులై 26వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయ్యింది. మొదటి సీజన్ సూపర్ సక్సెస్‌ఫుల్ అవ్వడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా రెండో సీజన్‌ను ప్రారంభించారు మేకర్స్. 2020 సెప్టెంబర్ 4వ తేదీన ‘ది బాయ్స్’ రెండో సీజన్ విడుదలయ్యింది. ఇక 2022లో మూడో సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.
‘ది బాయ్స్ సీజన్ 4’ను 2024 జూన్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు దించనున్నారు. ఇప్పటికే ‘ది బాయ్స్ సీజన్ 4’ రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘ది బాయ్స్’ మునుపటి సీజన్స్‌లో కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసిన ఫిల్ స్గ్రారిక్కియా ‘ది బాయ్స్ సీజన్ 4’లోని మొదటి ఎపిసోడ్ డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈసారి ‘ది బాయ్స్ సీజన్ 4’లో కూడా ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నట్టు సమాచారం. ‘ది బాయ్స్’ మొదటి మూడు సీజన్లలోనూ ఎనిమిదేసి ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ ఎనిమిది ఎపిసోడ్లకు సంబంధించిన టైటిల్స్ కూడా రివీల్ అయిపోయాయి.