Ponguleti : భద్రాచలం రాముడ్ని కేసీఆర్ మోసం చేశారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎనిమిదిన్నరేళ్ళు గడిచినా భద్రాచల పుణ్యక్షేత్రం హుండీలో రూ.100 వేసిన పాపాన పోలేదన్నారు. మైకు తీసుకుంటే ప్రజలను మభ్య పెట్టడంలో ఈ ముఖ్యమంత్రి దిట్ట... మాటలకే పరిమితం తప్ప... చేతలు అనేవి ఈ సీఎంలో లేవని విమర్శించారు. భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించి.. తను చేరబోయే పార్టీ తరపున అభ్యర్థిగా తెల్లం వెంకట్రావును ప్రకటించారు. ఆయననే గెలిపించాలని ప్రజల్ని కోరారు.
తెలంగాణ బిడ్డలను అసత్యలతో కేసీఆర్ భ్రస్టు పట్టిస్తున్నారనేది నగ్న సత్యమన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రానికి వంద కోట్ల రూపాయల నిధులు ఇస్తానన్న మాట అటు ఉంచితే గడిచిన ఎనిమిదిన్నరేళ్ళలో వంద రూపాయలు కూడా హుండీలో వేసిన పాపాన పోలేదన్నారు. జెండా ఏదైనా ఎజెండా మాత్రం రాబోయే ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను గద్దె దించటమే తమ ఎజెండా అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాచలం ఆత్మీయ సమ్మేళనంలో నిప్పులు చెరిగారు. ఆరు దశాబ్దాలు గా పోరాడి సంపాదించుకున్న రాష్ట్రం ఇప్పుడు సీఎం కేసిఆర్ వల్ల దగా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాచల నియోజకవర్గానికి వరద ముప్పు సమయంలో వేయి కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. టీఎస్పీఎస్ఈ పేపర్ లీకేజీలో తెలంగాణ ప్రభుత్వ అధికారుల, ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ తప్పిదానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహిస్తూ పరీక్ష రాసిన ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్ళు, నిధులు, నియమాకాలన్ని కల్వకుంట్ల కుటుంబానికే చెందుతున్నాయి తప్పా అర్హులు అయిన ఏ ఒక్కరికి న్యాయం చేకూరలేదన్నారు. నియమాకాలకోసం పోరాడి సంపాదించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగాలు లేక యువత దగా పడుతుందని ఆరోపించారు.
రాష్ట్రాన్ని ఉద్దరించలేని ఈ సీఎం దేశాన్ని ఉద్దరిస్తాడట... అంటు ఎద్దేవా చేశారు. ఏళ్ళు గడుస్తున్న పోడు భూముల రైతుల సమస్యలకు పరిష్కారం చూపలేదని విమర్శించారు. ఒక్క పోడు భూమి పట్టాదారునికి కూడా పట్టా ఇచ్చిన దాఖలా లేదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సిట్ కి కాకుండా సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అతి త్వరలోనే తన జెండా ఎజెండాను ప్రకటిస్తానని జెండా ఏదైనా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రానివ్వకుండా ఇంటికి సాగనంపడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ తెల్లం వెంకట్రావ్ బరిలో ఉంటారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అంటూ పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్కు రాజీనామా చేసిన పొంగులేటి ఇంత వరకూ ఏ పార్టీలో చేరలేదు. ఏ పార్టీలో చేరిన తన అనుచరులకు టిక్కెట్లు ఇప్పిస్తానని వారినే అభ్యర్థులుగా ప్రకటించి ప్రచారం కూడా చేస్తున్నారు.