Fire In Two Rail Coaches in Mettuguda: సికింద్రాబాద్ మెట్టుగూడ (Mettuguda) వద్ద గురువారం ఉదయం రెండు రైలు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆలుగడ్డ బావి వద్ద ఆగి ఉన్న స్పేర్ కోచ్‌ల్లో ఒక్కసారిగా మంటలు రాగా చుట్టూ పొగలు అలుముకున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నిలిచి ఉన్న బోగీల నుంచి మంటలు వస్తున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. వాషింగ్‌కు వెళ్లి ప్లాట్ ఫాంపైకి వస్తున్న అదనపు ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరా తీశారు. అయితే, బోగీల్లో షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలేంటి అనే దానిపై విచారణ చేస్తున్నారు. బోగీలో మంటలు చెలరేగిన ముందు క్లీనింగ్ సిబ్బంది ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.



Also Read: Hyderabad News: హైదరాబాద్‌లో దారుణాలు - 24 గంటల్లోనే 5 హత్యలు, 2 హత్యాయత్నాలు