Hajj 2024: హజ్ యాత్రకు వెళ్లిన 645 మంది యాత్రికులు ఎండ వేడిన తట్టుకోలే ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మృతుల్లో 68 మంది భారతీయులున్నారని సౌదీ అరేబియా ప్రకటించింది. వీళ్లలో ఎండ వేడిని తట్టుకోలేక చనిపోయిన వాళ్లతో పాటు మిగతా కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారని వెల్లడించింది. అంతకు ముందు 550 మంది చనిపోయారని అరబ్ దేశం ప్రకటించగా ఆ తరవాత ఈ మృతుల సంఖ్య పెరిగింది. మృతుల్లో 323 మంది ఈజిప్టియన్‌లు, 60 జోర్డాన్ దేశానికి చెందిన వాళ్లు ఉన్నట్టు అరబ్ ప్రతినిధులు వెల్లడించారు. ఈజిప్టియన్‌లలో ఎక్కువ మంది ఎండవేడిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల్లో ఇండోనేషియా, ఇరాన్, తునీషియా, సెనెగల్, ఇరాక్‌కి చెందిన వాళ్లూ ఉన్నారు.
గతేడాది హజ్ యాత్రలో 200 మంది యాత్రికులు చనిపోగా..ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. అయితే...ఎంత మంది చనిపోయారన్న లెక్కలు సౌదీ అరేబియా స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారమైతే దాదాపు 2,700 మంది ఎండ వేడికి అల్లాడిపోయినట్టు తెలుస్తోంది. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే..కొంత మంది భారతీయులు అదృశ్యమయ్యారు. ఇలా కనిపించకుండా పోయిన వాళ్లెవరు అన్న వివరాలూ తెలియడం లేదు. సౌదీ అరేబియా మాత్రం ఇది ఏటా జరిగేదే అని, కాకపోతే ఈ సారి సంఖ్య పెరుగుతుందా అన్నది చూడాలని అంటోంది. నిజానికి హజ్ యాత్రకు ఏటా యాత్రికుల సంఖ్య తగ్గుతోంది. సరిగ్గా అదే సీజన్‌లో అక్కడ విపరీతమైన ఎండలు ఉంటున్నాయి.