Harish Rao About Crop Loan Waiver: తెలంగాణ రైతులకు రుణమాఫీపై సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతుల రుణమాఫీ సోమవారం (ఆగస్టు 14) నుంచి జరుగుతుందన్నారు మంత్రి హరీష్ రావు. రైతుల బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని, తెలంగాణలోని రూ.99 వేల లోపు పంట రుణాలు మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం నుంచి విడుదల చేయనుందని వివరించారు. మరో పక్షం రోజుల్లో రూ.లక్ష ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు. అయితే మొత్తంగా నెల లోపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయనుందని స్పష్టం చేశారు.


కాంగ్రెస్ నేతలు కేసీఆర్ రుణమాఫీ చేయరు అని భ్రమలో ఉండి ఏది పడితే అది మాట్లాడారని, కానీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వలేదన్నారు. వాళ్ల అంచనాలు తలకిందులు చేస్తూ.. చెప్పినట్లుగా లక్ష రూపాయల రుణమాఫీని నెల రోజుల వ్యవధిలో చేసి తీరుతామన్నారు మంత్రి హరీష్ రావు. సోమవారం నాడు మీ ఫోన్లు దగ్గర పెట్టుకుని రెడీగా ఉండాలని రైతులకు సూచించారు. రూ.99 వేల లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయని శుభవార్త చెప్పారు. హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ కటక (బటన్) వొత్తుతడు. మీ ఫోన్లు మోగుతయ్ అని హరీష్ రావు చెప్పారు. లక్ష, అంతకు మించి రుణాలు ఉన్నవాళ్ల రుణమాఫీని 15, 20 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 


రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, పంట నష్టపరిహారం, రైతులకు సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీళ్లు, చెక్ డ్యామ్ లు, చెరువులు బాగు చేసుకున్నాం, కొరత లేకుండా ఎరువులు అందిస్తున్నాం. ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం, మండలానికో గోదాము కట్టినం, ఊరూరా సబ్ స్టేషన్ కూడా కట్టినం అన్నారు. సీఎం కేసీఆర్ బక్కగా ఉంటారు, పాపం కదా అనే సరికి కార్యక్రమంలో నవ్వులు పూయించారు. కేసీఆర్ కంటే బాగా ఎత్తు, లావు ఉన్నవాళ్లు గతంలో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ వాళ్లెందుకు రైతుల రుణాలు మాఫీ, రైతు బంధు, రైతు బీమా లాంటివి ఎందుకు చేయలేకపోయారు అని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు.


బీఆర్‌ఎస్‌ 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తుండగా.. కాంగ్రెస్ అంటే దొంగరాత్రి కరెంట్ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 3 గంటల కరెంట్‌ ఇస్తే రైతులకు సరిపోతుందని చెప్పిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.


తెలంగాణలో విడతల వారీగా రుణమాఫీ 
రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్ ఇటీవల అన్నారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలతో కొంత కాలం ఆలస్యమైందన్నారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న క్రమంలో అన్నదాలకు రుణమాఫీ కార్యక్రమాన్ని పున:ప్రారంభించేందుకు  ప్రగతి భవన్ లో కొన్ని రోజుల కిందట కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.