Fake Politics :  ఫేక్ అయినా పర్వాలేదు ఓట్లు తెచ్చి పెట్టేది ..ప్రత్యర్థుల ఇమేజ్ డ్యామేజ్ చేసేది ఏదైనా సరే ఫార్వార్డ్ చేసేయండి..  వైరల్ చేసేయండి అనేది ఇప్పటి రాజకీయ పార్టీల మాట. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. అందరిదీ అదే పని. అయితే గట్టి నెట్ వర్క్ ఉన్న వారు ఈ వ్యవహారాల్లో ముందుంటారు.  లేని వారు వెనుకబడి ఉంటారు.. అంతే కానీ ఇలాంటి ప్రచారాలు చేయకపోవడానికి విలువలు కారణం కాదు. అదే పరిస్థితి మునుగోడులోనూ కనిపించింది. ప్రారంభం నుంచి చివరికి వరకూ ఎన్నో ఫేక్ ప్రచారాలు నడిచాయి. అందులో నిజమేదో.. అబద్దమేదో కొందరికే తెలుసు. కొన్నింటిలో అసలు వాస్తవాలు ఇంకా తేలలేదు. 


మునుగోడులో బీజేపీ అభ్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన "ఫేక్" ప్రచారాలు !


మునుగోడులో ఉపఎన్నిక ఖాయమని తేలిన తర్వాత .. పలు రకాల లెటర్లు బయటకు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత .. బీజేపీ హైకమాండ్.. రాజగోపాల్ రెడ్డి పూర్తిగా వెనుకబడిపోయారని లేఖ రాసినట్లుగా చెబుతూ ఓ లేఖను వైరల్ చేశారు. అలాంటి లేఖను ఏ రాజకీయ పార్టీ అయినా రాస్తుందా అని ఎవరూ అనుకోలేదు. అక్కడ్నుంచి ప్రారంభమై చివరికి బండి సంజయ్ రాజీనామా లేఖ వరకూ వచ్చింది. మునుగోడులో ఓడిపోతున్నామని... చెబుతూ..  బండి సంజయ్ .. తన పదవికి రాజీనామా చేసినట్లుగా లే్ఖ సృష్టించారు. ఈ లేఖల్ని.. బీజేపీ ఖండించాల్సి వచ్చింది. ఇక సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి బదిలీ అయిన డబ్బుల వివరాల దగ్గర్నుంచి.. రూ. పద్దెనిమిది వేల కాంట్రాక్టుల వరకూ లెక్కలేనన్ని ప్రచారాలు జరిగాయి. 


ఇతర పార్టీలపైనా  అదే తరహా ప్రచారం !


ఈ ఫేక్ న్యూస్ ప్రచారంలో బాధితులు ఒక్క బీజేపీ అభ్యర్థి మాత్రమే కాదు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బాధితులే. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లుకు వ్యతిరేకంగా పలు రకాల ఫేక్ ప్రచారాలతో పోస్టింగ్‌లు కనిపించాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అసలు రేసులో లేరన్నట్లుగా చెప్పడానికి పెద్ద ఎత్తున సోషల్ మీడియా హ్యాండిల్స్ పని చేశాయి. ఈ ఫేక్ ప్రచారాలను ఎదుర్కొంటూనే అటు కాంగ్రెస్.. ఇటు అన్ని పార్టీలు.. తమ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాల్సి వచ్చింది. 


రోజుకో ఫేక్ సర్వేతో సోషల్ మీడియా కలగాపులగం !


మునుగోడు పేరుతో సోషల్ మీడియాలో ఎన్ని సర్వేలు ఉన్నాయో లెక్కించడం కష్టం.  గెలిచే పార్టీకే ఓటు వేసేందుకు కొంత మంది సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిని ఆక్టుటకునేందుకు  సర్వేలను రిలీజ్‌ చేశారు.  ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మూడు పార్టీల నేతలు ఇలాంటి సర్వేలను సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారు. కొన్ని సంస్థలు అసలు సర్వేనే చేయకుండా మునుగోడు ఓటర్‌ మనోగతం ఇది అంటూ పోస్టులు పెడుతుండగా, కొన్ని వ్యవస్థలను సైతం సర్వేల రొంపిలోకి లాగి రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వే పేరుతో సోషల్‌ మీడియాలో ఒక రిపోర్ట్‌ కలకలం సృష్టించింది. ఈ ప్రచారాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తిప్పికొట్టిన తర్వాత కూడా మునుగోడు నియోజకవర్గంలోని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో ఈ రిపోర్టును సర్క్యులేట్‌ చేస్తూనే ఉన్నారు. ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రముఖ సర్వే ఏజెన్సీ చెప్పిందని ప్రచారంలో పెడుతూ, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  ప్పటి వరకు మునుగోడు ఓటరు మనోగతం ఇది అంటూ 50 సంస్థలు సోషల్‌ మీడియా వేదికగా తమ సర్వేలను ప్రకటించాయి.  అందులో అత్యధికం ఫేకే. 


ఎక్కువ మందిని నమ్మిస్తే చాలనుకుంటున్న రాజకీయ పార్టీలు !


అది నిజంగా జరగకపోయినా చాలు.. తమకు అనుకూలంగా లేదా ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఉండేది ఏదైనా..  ప్రజలను నమ్మిస్తే చాలని అనుకుంటున్నాయి. ఈ క్రమంలో తాము అనైతిక రాజకీయానికి పాల్పడుతున్నామని వారు అనుకోవడం లేదు. రాజకీయాల్లో విజయానికి అడ్డదారులు  ఉండవని.. ఏ దారిలో వెళ్లినా విజయమే అంతిమమని.. అంటున్నారు. గెలిచిన తర్వాత అన్నీ మర్చిపోతారని అంటున్నారు. అందుకే ఇప్పటి రాజకీయాల్లో ఫేక్ ప్రచారాలే కీలకం అయిపోయాయి.