మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఏ పార్టీకి ఎలా ఉన్నా కానీ టీఆర్‌ఎస్‌కి మాత్రం కీలకంగా మారనుంది. ఎందుకంటే ఈ ఉపఎన్నిక ఫలితంపైనే ఇప్పుడు నేతల భవితవ్యం ఆధారపడి ఉంది. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నిక బాధ్యతనెత్తుకున్న ఎమ్మెల్యేలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. కమ్యూనిస్ట్‌ల పొత్తుతో రంగంలోకి దిగిన కారు పార్టీకి ఈ ఫలితం ఎలా వస్తుందోనని పార్టీ నేతలంతా టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా మునుగోడు బాధ్యతని మోస్తోన్న మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావుతోపాటు జిల్లా నేతలు హైరానా పడుతున్నారు. 100మంది ఓటర్లని ఒక్కో యూనిట్‌గా విభజించిన టీఆర్‌ఎస్ జిల్లానేతలతోపాటు పలువురు ఎమ్మెల్యేలను కూడా రంగంలోకి దింపింది. వీరందరిని నడిపించే బాధ్యతలను మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుకు అప్పజెప్పారు కెసిఆర్.
గులాబీ బాస్ చెప్పినట్లుగా మునుగోడులో ప్రచారం సాగింది. ఇక ఓటర్లు ఎవరిని గెలిపిస్తారన్నదే ఆ పార్టీని టెన్షన్ పెడుతోంది.
గెలిస్తే సరే కానీ ఒక వేళ మునుగుడులో కారు పార్టీకి మళ్లీ చేదు అనుభవమే ఎదురైతే పరిస్థితి ఏంటన్నదానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ గెలుపే బాధ్యతలు తీసుకున్న నేతల భవిష్యత్‌ని నిర్ణయించబోతోంది.
ఆ విషయాన్ని స్వయంగా కెసిఆరే స్పష్టం చేయడంతో రేపటి ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందా రాదా అన్నదానిపై ఆపార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. వలస నేతలతోపాటు మునుగోడు బాధ్యతలను నెత్తికెత్తున్న కొంతమంది ప్రజాప్రతినిధులంతా కూడా జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే క్యాడర్‌తో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరు బైబై చెప్పబోతున్నారన్నది మునుగోడు విక్టరీ నిర్ణయించనుంది.
దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కెటిఆర్-హరీశ్‌రావు కలిసి ప్రచారం నిర్వహించ లేదు. ఇప్పుడు బావ-బావమరుదులు కలిసి ప్రచారం నిర్వహించడంతో ఈసారి అనుకూల ఫలితం వస్తుందని శ్రేణులు ధీమాతో ఉన్నారు. అంతే కాదు వీళ్లిద్దరిపైనే కెసిఆర్ ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడంతో వారికి కూడా ఈ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా కాబోయే సిఎం కెటిఆర్ అని ఇప్పటికే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాబట్టి కెటిఆర్‌కి ఈ గెలుపు అనివార్యమని రాజకీయవిశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దుబ్బాకలో పార్టీని గెలిపించలేకపోయిన హరీశ్‌రావు ఈ మునుగోడు ఉపఎన్నికలో గెలిచి మామ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న కసితో పని చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
పరీక్ష రాజగోపాల్ రెడ్డి రాస్తుంటే... టీఆర్‌ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక ఫలితం పార్టీకే కాదు టీఆర్‌ఎస్ నేతలకు కూడా అగ్నిపరీక్షగా మారింది. రాజకీయ భవిష్యత్‌కి ఆశాజ్యోతిలా కనిపిస్తోంది. ఏడాది మాత్రమే మునుగోడుకి ఎమ్మెల్యేగా ఉండే ఆ ప్రజాప్రతినిధి ఎవరు అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు ఆగాల్సిందే!