పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజాప్రతినిధుల కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల సమయంలో ఓట్లు రాబట్టేందుకు డబ్బులు పంచారనే అభియోగాలు రుజువు కావడంతో మాజీ ఎమ్మెల్యేకు కోర్టు 6 నెలల జైలుశిక్ష విధించింది. దాంతోపాటుగా రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. దాంతో ఓటర్లను ప్రలోభపెట్టడం, డబ్బులు పంచడం అనే విషయం రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

  


ఎన్నికల సమయంలో అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటారు. డబ్బులు పంచారని, ఓటర్లకు మద్యం పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేశారంటూ ఆరోపణలు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికలకు సంబంధించిన కేసులో పినపాక మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. టీఆర్ఎస్ ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారంటూ పాయం వెంకటేశ్వర్లుపై కేసు నమోదైంది. ఎన్నికలు జరిగిన 2018లోనే ఆయనపై కేసు నమోదు చేశారు. 


Also Read: Weather Updates: తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు.. ఏపీలో పొడిగా వాతావరణం.. రెండ్రోజుల్లో వానలు


ఓటర్లకు డబ్బులు పంచారని, ఓట్ల కోసం ప్రజలను ప్రలోభ పెట్టారంటూ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటినుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసును గురువారం నాడు ప్రజా ప్రతినిధుల కోర్టు మరోసారి విచారించింది. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై నమోదైన అభియోగాలు రుజువు అయ్యాయి. అభియోగాలు నిజమని తేలడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. రూ.10 వేల జరిమానా సైతం విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసులో అప్పీలుకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధం కాగా, అందుకు న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతానికి జైలుశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అయితే మాజీ ఎమ్మెల్యే జరిమానాను చెల్లించారు. 


కాగా, ఇటీవల టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు సైతం కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించించి. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపణలు వచ్చాయి. ఆమెపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు 6 నెలల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంపీ మాలోతు కవిత హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో జైలుశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. 


Also Read: KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. అక్కడి నుంచి నీటి తరలింపును ఏపీ ఆపాల్సిందే