Etala Vs TRS :  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల మంటలు చోటు చేసుకుంటున్నాయి.  మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో పథకం ప్రకారం తన కాన్వాయ్‌పైనా దాడి చేశారని ఈట రాజేందర్ ఆరోపించారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని  పక్కా స్కెచ్ ప్రకారమే  తనపై దాడి జరిగిందని ఆరోపించారు. తన నుంచి ఒక్క రక్తపు బొట్టు కారినా దానికి సీఎం కేసీఆరే  బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే బీజేపీ నేతల పై దాడులు జరుగుతున్నాయన్నారు. హుజూరాబాద్‌ లో అవసరం లేకున్నా.. అనేక మందికి గన్ లైసెన్సు  లు ఇచ్చారన్నారు.


కేసీఆర్ తనపై పగబట్టారని ఈటల ఆరోపణ


హుజూరాబాద్‌లో టీఆర్ఎస్  ఓటమితో తనపై కేసీఆర్ పగ పట్టారన్నారు. మునుగోడులో కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారన్నారు. కేంద్రమంత్రికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బయటకు వెళితే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం కేసీఆర్ హాయాంలో లేకుండా పోయిందని ఈటల పేర్కొన్నారు.  పలివెల గ్రామంలో తన సతీమణి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారని ఈటల ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ప్రచారం చేస్తుంటే తాము అడ్డుకున్నామా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరే బయటకు వెళ్లినా సురక్షితంగా ఇంటికి చేరేవాళ్లమని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.  తెరాస దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలే బొందపెడతారన్నారు.  


బీజేపీ నేతలే దాడులు చేస్తున్నారని టీాఆర్ఎస్ కౌంటర్ 


ఈటల రాజేందర్ ఆరోపణలపై టీఆర్ఎస్ మండిపడింది. . కౌరవుల పక్కన ఉండి ధర్మయుద్ధం గురించి మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండేళ్లుగా ఈటల ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈటల రాజేందర్ కంటే ముందు పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరిగిందని చెప్పారు. మునుగోడుకు వెళ్లకుండా ఈటల రాజేందర్ ను, బీజేపీ నాయకులను ఆపిందెవరని ప్రశ్నించారు.  పలివెల గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ రాదని తెలిసిపోయిందని.. అందుకే సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. 


టీఆర్ఎస్ పాలనలో ఎక్కడా రాజకీయ ఘర్షణలు జరగలేదన్న జగదీష్ రెడ్డి 


 కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రాజకీయ ఘర్షణలు జరగలేదని చెప్పారు. అసలు తెలంగాణ అభివృద్ధి జరగకపోతే గుజరాత్ ప్రజలు ఎందుకు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు.   ప్ర‌జల నుంచి ఆద‌ర‌ణ లేదు బీజేపీకి. ఏ కార‌ణం చేత ఇవాళ ఉప ఎన్నిక తెచ్చారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు తెల్వ‌దా? బీజేపీ చ‌రిత్ర‌నే దాడులు, దుర్మార్గులు, అది భ‌యం గొలిపే పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఎవ‌రి మీద దాడి చేయ‌లేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.  రెండు పార్టీల మధ్య హత్య కుట్రల ఆరోపణలు కూడా చోటు చేసుకుంటూడం... తెలంగాణ రాజకీయాల్లో పెరుగుతున్న తీవ్రతకు అద్దం పడుతోంది. 


మునుగోడు ఉపఎన్నిక ఎవరికి ప్లస్‌? ఎవరికి మైనస్‌?