Kamalapuram MLA :  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం  గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలను, వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జులను ఇంటింటికి  పంపి.. ప్రజలకు అందిన పథకాల గురించి ప్రచారం చేస్తోంది. అయితే  కొన్ని చోట్ల అభివృద్ధి పనుల గురించి.. పథకాల గురించి నేతలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమకు ఎలాంటి లబ్ది చేకూరకపోయినా.. చేసినట్లుగా పాంప్లెట్లు ఇస్తున్నారని.. అర్హులమైనా పథకాలు ఇవ్వడం లేదని కొంత మంది ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొంత మంది అభివృద్ధి పనుల విషయంలో నిలదీస్తున్నారు. ఇలాంటి చోట్ల ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సహహనం కోల్పోకుండా ప్రజలకు సమాధానం ఇస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం సహనం కోల్పోయి వివాదాస్పదవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి చేరారు. 


గడప గడపకూ కార్యక్రమాన్ని ప్రతీ రోజూ నిర్వహిస్తున్న కమలాపురం ఎమ్మెల్యే


కమలాపురం నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో ఇంటింటికి వెళ్లి  ప్రభుత్వం చేసిన సాయం గురించి చెప్పి ఓట్లు అడుగుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి..  విన్ పల్లె మండలం అందెల గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. ఆయన గ్రామంలోకి వెళ్లిన సమయంలో గ్రామస్తులు ఒక్క సారిగా చుట్టుముట్టారు. గ్రామ సమస్యలు గురించి వివరించారు. కొంత మంది సమస్యలుచెబుతున్న సమయంలోనే.. మరో వ్యక్తి తన సమస్యను చెప్పడానికి ప్రయత్నించాడు. ఒకటి , రెండు సార్లు ఎమ్మెల్యే ఆగమని చెప్పినా ఆయన వినపించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన రవీంధ్రనాథ్ రెడ్డి ఆయనపై గట్టి అరిచి..  చేత్తో ఒక్క దెబ్బ వేశారు. దీంతో ఆ వ్యక్తి సైలెంట్ అయ్యారు. తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి అందరితో మాట్లాడి వెళ్లిపోయారు. 


పథకాలపై ప్రశ్నించిన ఓ గ్రామస్తుడిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే


అయితే గ్రామస్తుడ్ని .. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేయి చేసుకుంటున్న వీడియోను ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దాన్న ఇతరులకు షేర్ చేయడంతో.. ఆ వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో కడప జిల్లాలో వైరల్‌గా మారడంతో రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దురుసుగా ప్రవర్తించారని.. అధికారం ఉందనే అహంకారంతో ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందెల గ్రామస్తులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇంత వరకూ అధికారికంగా స్పందించలేదు. 


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో -  స్పందించని ఎమ్మెల్యే


కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి .. ముఖ్యమంత్రి జగన్‌కు సొంత మేనమామ.  కడప మేయర్‌గా పని చేసిన ఆయన రెండు సార్లు కమలాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తీరుపై నియోజకవర్గంలో పలు రకాల విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. తమ పార్టీ వారు తప్ప ఇతరులతో ఆయన దురుసుగా వ్యవహరిస్తూంటారని  చెబుతూంటారు. తాజాగా ఈ వీడియో వైరల్ కావడంతో.. మరోసారి ఆయనపై విమర్శలకు అవకాశం ఏర్పడింది.  


కాపుల్ని విడగొట్టి రాజకీయాల కోసం పావుల్ని చేస్తున్నారు: జ్యోతుల నెహ్రూ