హైదరాబాద్ ‌లోని చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ తీరు వివాదాస్పదం అయింది. దీంతో జైళ్ల శాఖ ఆయనపై బదిలీ వేటు వేసింది. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న చింతల దశరథం అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. న్యూడ్ వీడియో కాల్ చేస్తేనే పేరోల్ ఇప్పిస్తానని, జైలులో ఉన్న ఓ ఖైదీ సోదరిని వేధించారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఆన్ లైన్ లో న్యూడ్ కాల్స్ చేసి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. దానికి సంబంధించి మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 


గతంలో సైబర్ క్రైమ్ బాధితుడు
చర్లపల్లి డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న సీహెచ్ దశరథం గతంలో సైబర్ క్రైమ్ బాధితుడు కూడా. ఈ కేసు గత అక్టోబరులో వెలుగులోకి వచ్చింది. న్యూడ్ వీడియోల పేరుతో ఏకంగా ఆయన నుంచి రూ.97,500 వరకూ సైబర్ నేరగాళ్లు కాజేశారు. అప్పుడు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథానికి కొద్ది రోజుల క్రితం అపరిచిత యువతుల నుంచి కాల్ వచ్చింది. తర్వాత వారు చాటింగ్ కూడా చేశారు. అంతే కాకుండా నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడారు. దాన్ని రికార్డు చేసిన మాయగాళ్లు, దాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అయితే, డిప్యూటీ సూపరింటెండెంట్ దాన్ని పట్టించుకోకపోవడంతో సైబర్ నిందితులు మరో పన్నాగానికి తెర లేపారు. 


సీబీఐ అధికారి పేరుతో దశరథానికి ఫోన్ చేశారు. అవతలి సైబర్ నిందితుడు అజయ్‌ కుమార్‌ పాండే పేరుతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. న్యూడ్ వీడియో ఒకటి యూట్యూబ్‌ లో ఉందని తమకు ఫిర్యాదు అందిందని తనకు డబ్బు చెల్లిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకోబోమని నమ్మించాడు. అంతటితో ఆగకుండా సీబీఐ పేరుతో ఓ ఫేక్ లెటర్ కూడా పంపాడు. రాహుల్‌ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి కాల్‌ చేయాలని సూచించాడు. 


బాధితుడు అతడికి ఫోన్‌ చేశాక వీడియోలు డిలీడ్ చేసేందుకు ఏకంగా రెండు సార్లుగా రూ.97,500 సొమ్మును ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత తన దగ్గర మరో 2 న్యూడ్ వీడియోలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వాటిని వైరల్‌ చేయకుండా ఉండాలంటే ఇంకో రూ.85 వేలు పంపాలని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో డ్యూటీలో ఉండగా తరచూ కంగారుగా కనిపిస్తున్న దశరథాన్ని కొలీగ్ అయిన మరో పోలీసు ఉన్నతాధికారి గమనించి ఆరా తీశారు. 


ఏమైందని ప్రశ్నించగా, దశరథం జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఇది సైబర్‌ మోసం అని చెప్పి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇవ్వడంతో బాధితుడు కుషాయిగూడ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఈ మోసానికి పాల్పడిన నిందితులు పశ్చిమబెంగాల్‌ నుంచి మోసం చేసినట్లుగా గుర్తించారు.


ఆ వ్యక్తిపై తాజాగా న్యూడ్ వీడియో కాల్ బెదిరింపుల ఆరోపణలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.