EC Permission To Telangana Formation Day Celebrations: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆ రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీ అనుమతి లభించినందున ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నట్లు సీఎస్ తెలిపారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ధేశించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలు కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని  పోలీస్ శాఖను ఆదేశించారు.


'సమన్వయంతో పని చేయాలి'


సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అలాగే, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని అన్నారు. పండుగ వాతావరణం ప్రతిబింబించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు నిర్దేశించారు. వేడుకలు చూసేందుకు వచ్చే ప్రజలు ఎండలకు గురికాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి షామియానాలు, టెంట్ ఏర్పాటు చేయాలని.. ఆర్అండ్‌బీ శాఖను ఆదేశించారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని.. వేదిక వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖకు ఆదేశాలిచ్చారు. వేడుకల నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు.


Also Read: TS EAPCET Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే