Rajinikanth Receives UAE's Golden Visa: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ప్రతిష్టాత్మక గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అరుదైన గౌరవాన్ని అందించిన యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. గోల్డెన్‌ వీసా పొందడం అత్యంత గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. గోల్డెన్ వీసా వచ్చేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.“ యూఏఈ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మ  గోల్డెన్ వీసాను అందుకోవడం సంతోషంగా ఉంది. చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ వీసా వచ్చేలా సహకరించిన లులు గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అబుదాబి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు” అని వెల్లడించారు.






గోల్డెన్ వీసా ఎవరికి ఇస్తారంటే?


యూఏఈ ప్రభుత్వం వ్యాపారవేత్తలు, ఆయా సంస్థల వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్య విభాగాల్లోని ప్రముఖులకు 10 ఏళ్ల కాలపరిమితితో ప్రత్యేక గోల్డెన్ వీసాలను అందిస్తోంది. ఈ వీసా అందుకున్న వాళ్లు ఎలాంటి పరిమితులు, ఆంక్షలు లేకుండా యూఏఈలో నివసించవచ్చు. 2019 నుంచి గోల్డెన్ వీసాల జారీ మొదలయ్యింది.  ఈ వీసాకు 10 ఏండ్లు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత రెన్యుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసాతో యూఏఈ పౌరులకు అందే అన్ని సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఆ దేశంలో వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు.  


ఇప్పటి వరకు గోల్డెన్ వీసాలు పొందిన భారతీయులు ఎవరంటే?


యూఏఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పలువురు భారతీయ ప్రముఖులకు గోల్డెన్ వీసాలను అందించింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తొలిసారి ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. అనంతరం బాలీవుడ్ న‌టులు సంజ‌య్ ద‌త్‌, సునీల్ శెట్టి, మౌనీ రాయ్‌, ఫ‌రా ఖాన్‌, బోనీ క‌పూర్ ఫ్యామిలీ , నేహా క‌క్కర్‌, సింగ‌ర్ సోనూ నిగ‌మ్ పొందారు. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న తొలి ఇండియన్ హీరోయిన్ గా త్రిష గుర్తింపు తెచ్చుకుంది. మ‌ల‌యాళ సినిమా పరిశ్రమ నుంచి మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, టోవినో థామ‌స్‌, దుల్కర్ స‌ల్మాన్ ఈ వీసాను పొందారుల. టాలీవుడ్ సినీ ప్రముఖుల విషయానికి వస్తే రామ్ చరణ్ సతీమణి ఉపాస‌న తొలిసారి ఈ గోల్డెన్ వీసా పొందింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు కూడా ఈ వీసాను తీసుకున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది.  


ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. టీజీ జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read: హీరోయిన్‌ కాదని దెయ్యాన్ని ప్రేమించిన హీరో, ఇంతకి ఎవరా దివ్యవతి - ఆసక్తి పెంచుతున్న లవ్ మీ రిలీజ్‌ ట్రైలర్‌