హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం సాగుతోంది. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది మళ్లీ ఆయన తన నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావుపై ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను దిక్కులేని వాణ్ని కానని, హుజూరాబాద్ ప్రజల్లో ఉన్నానని వ్యాఖ్యానించారు. దమ్ముంటే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులలో ఎవరైనా ఒకరు తనపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. తనను ఓడించేందుకు రూ.5 వేల కోట్లైనా ఖర్చుపెడతారని ఈటల ఆరోపించారు. ఎవరు గెలుస్తారో వచ్చే ఉప ఎన్నికల్లో చూసుకుందామంటూ సవాలు విసిరారు. తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
‘‘నేను దిక్కులేని వాడ్ని కాదు. హుజూరాబాద్ ప్రజల హృదయాల్లో ఉన్న బిడ్డను. నేను ప్రజల గుండెల్లోనే ఉన్నా. హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు రూ.5 వేల కోట్లయినా ఖర్చు పెడతరంట. రేపు ఎన్నికల్లో చూసుకుందాం. కేసీఆర్, హరీశ్ రావుకు ఇదే నా సవాలు. దమ్ముంటే నా మీద పోటీ చేసి మీరు గెలవండి. పదేసి లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. నేనే వాళ్ల గుండెల్లో ఎప్పటికీ ఉంటా.. ఎమైతదో ఎన్నికల తర్వాత చూసుకుందాం.’’ అని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలపై ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘‘గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు. వాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే. నన్ను కాపాడుకుంటరో.. చంపుకుంటరో ఇక మీ ఇష్టం.” అంటూ ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఎక్కడ కష్టం ఉంటే తాను అక్కడ ఉన్నానని ఈటల గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌కు దళితుల ఓట్లపై తప్ప.. హుజూరాబాద్ దళితులపై అసలు ప్రేమ లేనే లేదని ఈటల అన్నారు. ‘‘హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు వాటిలో గెలిచేందుకు వరద సాయం కింద ఇంటికి రూ.10 వేలు ఇస్తామన్నారు. ఓట్లయ్యాక ఆ హామీనే మర్చిపోయారు.’’ అని ఈటల విమర్శించారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ప్రలోభాలు ఆపేసి, పోలీసులను వెనక్కి రప్పించి నిజాయతీగా ఎన్నికల్లో గెలవాలని సవాలు విసిరారు. ‘‘టీఆర్ఎస్ వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఏమిచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండి.” అని ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read: Narayanpet Violence: మహిళకు ఫుల్లుగా మద్యం తాగించారు.. ఆపై ఊహించని దారుణం..