భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్ని రోజులుగా తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాతి నుంచి ఇది మరింతగా కొనసాగుతోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాను తమ పదవులకు రాజీనామా చేసేస్తామని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయబోమని స్పష్టం చేశారు. కావాలంటే బాండ్ రాసి ఇస్తామని సవాలు విసిరారు. 


తన పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు, రోడ్లను పూర్తి చేస్తే రాజకీయంగా పోటీలో నిలవబోమని చెప్పారు. చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వివిధ చోట్ల పనులకు సంబంధించి.. కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీనివల్ల నష్టాల్లో కూరుకుపోయిన కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారని మండిపడ్డారు. 


Also Read: Earthquake: సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. గుంటూరు జిల్లాలో కూడా కదలికలు..


ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంటేనే.. ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని కోమటిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. హిట్లర్ కనుక బతికి ఉండి ఉంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రొటోకాల్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు కేబినెట్‌లో చోటు దక్కలేదని, దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసునని వెల్లడించారు. తాను ఎంపీ అయి ఉండి కూడా కేసీఆర్‌ను కలిసేందుకు గత రెండేళ్ల నుంచి ఎన్నోసార్లు ప్రయత్నం చేశానని.. అయినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న వాసాలమర్రికి కేసీఆర్ రెండు సార్లు వస్తే ఒక ఎంపీగా ఉన్న తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన చెందారు.


హైదరాబాద్‌లో మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్‌లో గళమెత్తుతానని అన్నారు. మూసీ నదిని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. దళిత బంధు గురించి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన రోజే కేసీఆర్ ఓడిపోయినట్లని అన్నారు. దళితులకు కేబినెట్‌లో స్థానం లేదు గానీ, దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు.


Also Read: Hyderabad Crime News: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఇంతలో భర్త ఎంట్రీ, చివరికి ఏమైందంటే..


Also Read: Narayanpet Violence: మహిళకు ఫుల్లుగా మద్యం తాగించారు.. ఆపై ఊహించని దారుణం..