ఏటీఎంలో డబ్బును కాజేయాలని ఓ దొంగ గొప్ప ప్లానే వేశాడు. అయితే, ఏటీఎంను ముందు నుంచి తెరవడం కష్టమని భావించి దాని వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ, ఊహించని విధంగా మెషిన్‌లో చిక్కుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. 


గురువారం (ఆగస్టు 5) తెల్లవారుజామున అనియాపురం పోలీసులకు ఓ దొంగ ఏటీఎంలో చిక్కుకున్నాడని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు ఆ దొంగ ఏటీఎం గదిలో చిక్కుకున్నాడని భావించారు. కానీ, అక్కడికి వెళ్లి చూస్తే.. ఏటీఎంకు ఫ్లైవుడ్‌కు మధ్య ఇరుక్కుని లోపలికి వెళ్లలేక.. బయటకు రాలేక విలవిల్లాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని ఎలాగోలా కష్టపడి అతడిని బయటకు తీసుకొచ్చారు. 


నిందితుడి పేరు ఎం.ఉపేంద్ర రాయ్(28) అని, బీహార్‌లోని ఈస్ట్ చంప్రాన్ జిల్లా నుంచి తమిళనాడుకు వలస వచ్చాడని పోలీసులు తెలిపారు.  ఉపేంద్ర డబ్బులు దొంగిలించడం కోసం ఏటీఎంపైన ఉండే ఫ్లైవుడ్‌ను కొంత వరకు తొలగించి.. వెనుక వైపుకు వెళ్లాడు. ఆ తర్వాత రాయితో ఏటీఎంను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ శబ్దాలు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏటీఎం బయట అలికిడి వినిపడటంతో ఉపేంద్ర తప్పించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో ఏటీఎంకు ఫ్లైవుడ్‌కు మధ్య ఇరుక్కున్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఉపేంద్రను పోలీసులు నమక్కల్ సబ్-జైలుకు తరలించారు. 


ఏటీఎంలో చిక్కుకున్న దొంగను ఈ వీడియోలో చూడండి:


ఇటీవల  మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో ఓ దొంగ ఏకంగా పోలీస్ అధికారి ఇంటికే కన్నం వేశాడు. కొత్వాలీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ASI) కమలేష్ కటారే తెలిపిన సమాచారం ప్రకారం.. చత్తీస్‌గడ్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి ఫ్యామిలీ బింద్‌లో నివసిస్తోంది. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఓ దొంగ ఇంట్లోకి చొరబడి వెండి, బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. చిత్రం ఏమిటంటే.. అతడు వెళ్తూ వెళ్తూ ఆ పోలీస్ అధికారి కుటుంబానికి ఓ లేఖరాసి వెళ్లాడు. ‘‘దిక్కుతోచని స్థితిలో నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను. నా స్నేహితుడి కోసమే ఇలా చేయాల్సి వచ్చింది. లేకపోతే అతడి ప్రాణాలు పోతాయి.  నగదు, నగలు పోయాయని బాధపడవద్దు. నాకు డబ్బులు రాగానే తిరిగి ఇచ్చేస్తాను’’ అని తెలిపాడు. అయితే ఈ చోరీలో కచ్చితంగా ఇంట్లో తెలిసిన వ్యక్తుల హస్తం ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!