కరోనా బారి నుంచి బయట పడేందుకు ప్రస్తుతం మన దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను కలిపి తీసుకుంటే ఏమవుతుంది అనే దానిపై పరిశోధన జరిగింది. అయితే ఈ రెండు టీకాలు కలిపి తీసుకుంటే కరోనా నుంచి మరింత రక్షణ కలుగుతుందని ఆ అధ్యయనంలో తేలినట్లు ఐసీఎమ్ఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) ప్రకటించింది.
ఇది సురక్షితం మాత్రమే కాదని కరోనా మహమ్మారి నుంచి మరింత రక్షణ ఇస్తుందని అధ్యయనం వెల్లడించింది.
గత నెలలో డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)కు సంబంధించిన నిపుణుల కమిటీ.. సీరం ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తీసుకొచ్చిన కొవాగ్జిన్ టీకా డోసులను కలిపి తీసుకోవడంపై అధ్యయనం చేయాలని సూచించింది. వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎమ్‌సీ) ఈ పరిశోధన చేసేందుకు అనుమంతి పొందింది.
రెండు రకాల వ్యాక్సిన్ డోసులను (ఒక కొవిషీల్డ్, ఒక కొవాగ్జిన్) ఓ వ్యక్తికి ఇవ్వొచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడమే ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) తెలిపింది.
పలు చర్చల తర్వాత సీఎమ్‌సీకి ఈ పరిశోధన చేసేందుకు నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. 300 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఫేజ్ 4 క్లినికల్ ట్రయల్స్ చేసినట్లు సమచారం. తాజాగా ఈ అధ్యయన ఫలితాలను ఐసీఎమ్ఆర్ ప్రకటించింది.
విదేశాల్లోనూ ప్రయోగాలు..
కరోనా టీకా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు, మెరుగైన సమర్థతను కనబరిచిన రెండు వ్యాక్సిన్లను కలిపి ఇస్తే ఎలా ఉంటుందోనని బ్రిటన్ ఇప్పటికే పరిశోధన చేసింది. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్, ఫైజర్ వ్యాకిన్లను కలిపి ప్రయోగాలు జరిపారు.
బ్రిటన్ చేసిన అధ్యయనంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఆస్ట్రాజెనకా డోసు తీసుకుని అనంతరం ఫైజర్ తీసుకోవడం వల్ల కరోనా నుంచి మరింత రక్షణ కలుగుతుందని అధ్యయనం వెల్లడించింది. దక్షిణ కొరియా కూడా ఇప్పటికే దీనిపై పరిశోధన చేసింది. ఈ రెండు వ్యాక్సిన్ లను కలిపి తీసుకోవడం వల్ల సాధారణ వ్యాక్సినేషన్ కంటే ఆరు రెట్లు రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది.
తమ స్పుత్నిక్-V వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్ టీకాతో కలిపి ప్రయోగాలు నిర్వహించాలని ఆస్ట్రాజెనెకాను రష్యా ఇదివరకే కోరడం తెలిసిందే.