హుజూరాబాద్ ఉపఎన్నికల్లో  టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కూ అభ్యర్థిపై ఓ క్లారిటీ ఉంది. బీజేపీకి కూడా ఉంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితే గందరగోళంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారని 16వ తేదీన ప్రారంభించనున్న దళిత బంధు పథకం వేదికపై నుంచి ఆయన అభ్యర్థిని ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేయడం ఖాయమే. అయితే ఆయన భార్య పేరు కూడా వినిపిస్తోంది. అభ్యర్థి ఎవరైనా కావొచ్చన్నట్లుగా ఈటల రాజేందర్ సతీమణి జమున మీడియాతో వ్యాఖ్యానించడంతో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు అభ్యర్థి అవుతారు. అంత వరకూ స్పష్టత ఉంది. 


అయితే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిపై స్పష్టత లేకుండా పోయింది. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి మొదటి ఎన్నికల పరీక్ష కావడంతో ఆయన మరింత చాలెంజింగ్‌గా ఈ ఎన్నికను తీసుకున్నారు. అభ్యర్థి విషయంపై రకరకాల పరిశీలనలు చేస్తున్నారు కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోయి ఎమ్మెల్సీ అయిపోయారు.  ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేతగా ఉన్న స్వర్గం రవి అనే నేత కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి నియోజవర్గంలో లేకుండా పోయారు. ఇప్పుడు అభ్యర్థిని ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకురావడం తప్ప.. పీసీసీ చీఫ్‌కు మరో మార్గం లేకుండా పోయింది. 


ప్రస్తుతం అభ్యర్థి ఎవరన్నదానిపై రేవంత్ రెడ్డి కసరత్తు జరుపుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితులు డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉన్నారు. అందుకే ఆ నియోజకవర్గ ఉపఎన్నికకు కాంగ్రెస్ ఇంచార్జ్‌గా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహను రేవంత్ మొదటే నియమించారు. దీంతో ఆయనే అభ్యర్థి అవుతారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం మరికొంతమంది పేర్లను కూడా రేవంత్ పరిశీలిస్తున్నారు.  వారిలో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే కొంది మంది ప్రముఖ బీసీ నేతల పేర్లతోనూ సర్వేలు నిర్వహింపచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరిని అభ్యర్థిని చేయాలన్నదానిపై రేవంత్ ఓ నిర్ణయానికి రాలేకపోయినట్లుగా తెలుస్తోంది.


మరోవైపు దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమయిందని రాజకీయవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని చెబుతున్నారు. అభ్యర్థిని చివరి క్షణం వరకూ ఖరారు చేసుకోకపోతే.. దుబ్బాక తరహా ఫలితం వస్తుందని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కాంగ్రెస్ నేతలు తాము సర్వే నిర్వహింప చేశామని.. కాంగ్రెస్‌కు ఐదు శాతం ఓట్లు వస్తాయని చెప్పడం ప్రారంభించారు. పీసీసీ చీఫ్‌గా తొలి ఎన్నిక కావడంతో రేవంత్‌కు అగ్నిపరీక్షగా మారింది .