Traffic E Challan: ఇకపై రాంగ్ పార్కింగ్ చేసి, ఓవర్‌ స్పీడ్‌ వెళ్లి ఎప్పుడో ఓ సారి చలాన్లు కట్టుకుందాం అంటే కుదరదు.  ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం, ఈ-చలాన్ జరిమానాలను మూడు నెలల్లో చెల్లించకపోతే డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడం లేదా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా, వారి వాహన ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా పెరిగే అవకాశం ఉంది.  రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నియమాల పట్ల డ్రైవర్లలో బాధ్యతను పెంచడం లక్ష్యంగా ఈ నిబంధనలు తీసుకువస్తున్నారు. 

 

రూల్స్ మరింత కఠినం

 

మూడు నెలల్లో చలాన్లు చెల్లించకపోతే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. అలాగే ఓ ఆర్థిక సంవత్సరంలో మూడు కంటే ఎక్కువ డ్రైవింగ్ అఫెన్సులు ఉన్నా కూడా లెసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. రెడ్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ పార్కింగ్, వేగంగా వాహనాలను నడపడం వంటివి చేస్తే.. మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ నిలిపేస్తారు. అలాగే చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి కూడా నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. 

 

తక్కువ వసూళ్ల రేటు - రాష్ట్రాల వారీగా గణాంకాలు

 

ఈ-చలాన్‌ల వసూళ్ల రేటు దేశవ్యాప్తంగా కేవలం 40% మాత్రమే ఉందని ఒక TOI నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే, ఢిల్లీలో అత్యల్ప వసూళ్ల రేటు 14% మాత్రమే ఉండగా, కర్ణాటక (21%), తమిళనాడు , ఉత్తరప్రదేశ్ (27% చొప్పున), ఒడిశా (29%) రాష్ట్రాలు కూడా తక్కువ వసూళ్ల రేటును నమోదు చేశాయి. అయితే, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా వంటి రాష్ట్రాలు 62%-76% వసూళ్ల రేటుతో మెరుగైన పనితీరును కనబరిచాయి.

 

కోర్టులో సవాలు చేస్తే ఊరట

ఈ-చలాన్‌లను కోర్టులో సవాలు చేసే డ్రైవర్లకు  ఊరట లభిస్తోంది. డేటా ప్రకారం, పోలీసులు విధించిన జరిమానాలలో 80% వరకు కోర్టులో తగ్గింపు పొందుతున్నాయి. దీనికి కారణం, ఆలస్యంగా చలాన్ నోటిఫికేషన్లు, తప్పుడు జరిమానాలు  ట్రాఫిక్ కెమెరాల్లో లోపాలు వంటి వాటి కారణంగా చలాన్లను కోర్టులు రద్దు చేస్తున్నాయి. దీనిని సంస్కరించేందుకు 

కొత్త నిబంధనలు  ఈ-చలాన్ ప్రక్రియలో మార్పులు తీసుకొస్తున్నారు. 

 

కొత్త డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం, ఈ-చలాన్ ప్రక్రియను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ట్రాఫిక్ కెమెరాల కోసం కనీస స్పెసిఫికేషన్‌లతో కూడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను అమలు చేయనున్నారు. ఈ కొత్త నియమాల ప్రకారం:



  • ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన మూడు రోజుల్లో డ్రైవర్‌కు ఈ-చలాన్ నోటిఫికేషన్ వెళుతుంది.



  • డ్రైవర్ 30 రోజుల్లో జరిమానా చెల్లించాలి లేదా దానిని సవాలు చేయాలి.



  • 30 రోజుల్లో ఎటువంటి చర్య తీసుకోకపోతే, అది ఒప్పుకున్నట్లు భావిస్తారు.



  • 90 రోజుల్లో జరిమానా చెల్లించకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ సస్పెండ్ అవుతుంది. 



డేటా అప్‌డేట్ సమస్యలపై చర్యలు

చాలా మంది డ్రైవర్లు తమ సరైన చిరునామా మరియు మొబైల్ నంబర్‌లను అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఈ-చలాన్ నోటిఫికేషన్లు వారికి అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ప్రభుత్వం వాహన్ ,సారథి పోర్టల్‌లలో డ్రైవర్లు తమ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు మూడు నెలల విండో పీరియడ్ ఇస్తుంది. . ఈ వ్యవధి తర్వాత, ఈ సేవలను పొందడానికి మొబైల్ నంబర్ అప్‌డేట్ తప్పనిసరి అవుతుంది. పొల్యూషన్ సర్టిఫికెట్ పొందాలన్నా, ఆర్సీని రెన్యువల్ చేయించుకోవాలన్నా.. మొబైల్ నెంబర్ అప్డేషన్ తప్పని సరి చేయనున్నారు. 

 

ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ప్రభావం

చెల్లించని ఈ-చలాన్‌లను ఇన్సూరెన్స్ ప్రీమియంలతో అనుసంధానం చేయాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.  ఆర్థిక సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ చలాన్‌లు చెల్లించకపోతే, డ్రైవర్‌కు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. ఈ నిబంధన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 23 రాష్ట్రాలు మరియు ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ మానిటరింగ్‌ను అమలు చేయడంలో భాగంగా రూపొందించబడింది.

 

టెక్నాలజీని ఉపయోగించి ట్రాఫిక్ నియమాల అమలు

సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 136A ప్రకారం, స్పీడ్ కెమెరాలు, CCTVలు, స్పీడ్ గన్‌లు, బాడీ-వార్న్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌లను ఉపయోగించి ట్రాఫిక్ నియమాల అమలును మరింత బలోపేతం చేయనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను సమర్థవంతంగా గుర్తించి, జరిమానాల వసూళ్లను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఈ కొత్త డ్రాఫ్ట్ నిబంధనలు ఇంకా అధికారికంగా అమలులోకి రాలేదు, కానీ ఇవి ఆమోదం పొందితే ట్రాఫిక్ నియమాల అమలు మరియు రోడ్డు భద్రతలో గణనీయమైన మార్పులు రావొచ్చు.