Drug Control Bureau Notices To Blood Banks In Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో (Drug Control Bureau) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్లేట్ లెట్స్, ఫ్లాస్మా నిల్వలు, రక్త సేకరణ పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్, మెహిదీపట్నం, మల్కాజ్ గిరి, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కోఠి, బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని బ్లడ్ బ్యాంకులో ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, రక్తం సేకరించిన తర్వాత అందులోని ప్లేట్ లెట్స్, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడంతో ఆ రక్తం ఎక్కించిన రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచూ ఫిర్యాదులు రావడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


ఆ బ్లడ్ బ్యాంక్స్ ఇవే


శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్ (మలక్ పేట్), నవజీవన్ బ్లడ్ సెంటర్ (చైతన్యపురి), ఏవీఎస్ బ్లడ్ సెంటర్ (లక్డీకాపూల్), రుధిర వాలంటరీ బ్లడ్ సెంటర్ (హిమాయత్ నగర్), ప్రతిమా సాయి బ్లడ్ సెంటర్ (సికింద్రాబాద్), తలసేమియా రక్షిత వాలంటరీ బ్లడ్ బ్యాంక్ (కోఠి), వివేకానంద బ్లడ్ సెంటర్ (మెహదీపట్నం), నంది బ్లడ్ సెంటర్ (బాలానగర్), ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్ (ఉప్పల్)


కాగా, ఇటీవల మనుషుల రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో అమ్ముతున్న బ్లడ్ బ్యాంక్ ల పర్మిషన్ ను అధికారులు రద్దు చేశారు. మియాపూర్ లోని శ్రీకర బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫా లోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ సంస్థలు అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ లో అమ్ముతున్న ముఠాను అధికారులు ఇదివరకే పట్టుకున్నారు. ముసాపేటలోని హీమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కేంద్రంగా ప్లాస్మా నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ను విచారించారు. శ్రీకర బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ లు హీమో ల్యాబ్ నుంచి బ్లాక్ లో ప్లాస్మా, రక్తం కొంటున్నాయని అధికారులు గుర్తించారు. దీంతో వాటిపై చర్యలు చేపట్టారు.


ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్జీఓ బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖులు పుట్టిన రోజుల నేపథ్యంలో పలు చోట్ల రక్తదాన శిబిరాలు పెట్టి రక్తాన్ని సేకరిస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు అందించాల్సి ఉంది. కానీ, నగరంలో పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో అధికారులు చర్యలు చేపట్టారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం బ్లడ్ ను ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్ జే క్యాన్సర్ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధననూ పలు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.


Also Read: Jahnavi Kandula Case : జాహ్నవి కందుల కుటుంబానికి అన్యాయమే - తీవ్రంగా స్పందించిన కేటీఆర్