Sreeshanth wants to act in NTR’s Film : 'RRR' సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొమరం భీంగా అద్భుత నటన కనబర్చి గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు తారక్. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఎన్టీఆర్ కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్టులో క్రికెటర్స్ కూడా ఉన్నారు.


హైదరాబాదులో మ్యాచ్ ఉందంటే చాలు మన టీమ్ ఇండియా క్రికెటర్స్ తమకి ఇష్టమైన హీరోలను కలుస్తుంటారు. సూర్య కుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్, చాహల్, ఇషాన్ కిషన్ లాంటి స్టార్ క్రికెటర్స్ ఇప్పటికే ఎన్టీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా మరో క్రికెటర్ అయితే ఏకంగా ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టాడు.


ఎన్టీఆర్ తో నటించాలని ఉంది - శ్రీశాంత్


టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తాజా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ పై తనకున్న అభిమానాన్ని చూపుతూ తాజా ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చేసిన కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ మేరకు శ్రీశాంత్ మాట్లాడుతూ.." ఎప్పటికైనా ఎన్టీఆర్ తో నటించాలని ఉంది. ఎన్టీఆర్ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. గతంలో ఒకసారి నేను ఎన్టీఆర్ ని కలిసాను. ఆ సమయంలో ఆయనతో మాట్లాడాను. మీరు బాగా డాన్స్ చేస్తారు అని చెప్పాను. దానికి ఆయన థాంక్స్ చెప్పడంతో పాటు సరదాగా ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చారు. ఎన్టీఆర్ ని చూస్తే ఎంతో మోటివేట్ గా ఉంటుంది. నేను ఎన్టీఆర్ ని కలిసిన ఈవెంట్లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.


క్రికెట్ నుంచి సినిమాల్లోకి


ఒకప్పుడు ఇండియన్ బెస్ట్ బౌలర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత 2017లో సినీ ఆరంగేట్రం చేశాడు. 'అక్సర్ 2' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సౌత్ సినిమాల్లో నటించాడు. చివరగా 'కాతువాకుల రెండు కాదల్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు కొన్ని సౌత్ సినిమాల్లో నటిస్తున్నాడు.


దసరాకి వస్తున్న 'దేవర'


కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర' పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'దేవర' పార్ట్-1 ని వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ముందే అనౌన్స్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల దేవర రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. అదే రిలీజ్ డేట్ కి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' రాబోతుండడంతో 'దేవర' రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని కన్ఫర్మ్ అయింది.


ఈ క్రమంలోనే 'దేవర' లేటెస్ట్ రిలీజ్ డేట్ ని మూవీ టీం ప్రకటించింది. 'దేవర' పార్ట్-1 ని దసరా కానుకగా అక్టోబర్ 10న  రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.