మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత లేఖ ఉన్నట్లు భ్రమపడటం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఎమ్మెల్సీ కవిత లేఖ రాస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ ఆమె కోసమే బిల్లు పెట్టారు అన్నట్లు మాట్లాడారంటూ సెటైర్లు వేశారు. డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. కవిత మీద ఉన్న ఆరోపణల్ని పక్కదోవ పట్టించేందుకు నాటకాలు ఆడొద్దని, ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. రాత్రి పదిన్నర గంటల తరువాత మీడియాతో మాట్లాడుతూ అంతా తమ ఘనతేనని గొప్పులు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల హామీలను ఓ పథకం ప్రకారం మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నేరవేరుస్తుందన్నారు.
ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తున్నామని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం వచ్చిందన్నారు. కానీ కవిత, ఆమె తండ్రి కేసీఆర్ లేఖ రాస్తేనే ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారనే తీరుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మీ నాన్నకు కవితను తప్ప ఇతర మహిళలను గౌరవించే అలవాటు లేదన్నారు. అలాంటి మీరు లేఖ రాస్తే ప్రధాని మోదీ స్పందించారనేలా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులల్లో మహిళలు ఎందురు ఉన్నారో చెప్పాలని కవితను డీకే అరుణ ప్రశ్నించారు. పార్టీలో కీలక పదవుల్లో మహిళలు లేరని, ముందు ఈ విషయంపై కేసీఆర్ తో చర్చించాలని కవితకు సూచించారు.
తాను ఓ రైతు కుటుంబం నుంచి వచ్చిన మహిళ అని, రాజకీయ కుటుంబం లో పెరిగాయనని చెప్పారు. పెళ్లి తరువాత ఇంకో రాజకీయ కుటుంబంలోనూ పాలిటిక్స్ లో కొనసాగి ఎమ్మెల్యేగా సేవలు అందించానని చెప్పారు. మంత్రిగానూ ఎంతో కష్టపడి జిల్లా ప్రజలకు సేవ చేశానని గుర్తుచేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం తాను ఎంత పనిచేశానో తన గురించి తెలిసినా కేసీఆర్ అవమానకరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం ఎంతగానో తాను పాటుపడ్డా, అంతా కేవలం తమ ఘనతగా కేసీఆర్ ప్రచారం చేసుకున్నారంటూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు క్రెడిట్ పై వ్యాఖ్యలు చేశారు. ముందుగా మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని కేసీఆర్ కు కవిత చెప్పాలని కోరారు. కేవలం మీ మీద వచ్చిన ఆరోపణల్ని పక్కదారి పట్టించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లులో కదలికను మీ ఘనతగా చెప్పుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం పొంది, అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే బిల్లు చట్టంగా మారుతుంది. తద్వారా చట్టసభల్లో (పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో) 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. చట్టసభలలో మహిళల ప్రాతినిథ్యం పెరగనుంది. అయితే నియోజకవర్గాల పునర్ విభజన జరిగితేనే వారికి మరింత ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.