Telangana CM Revanth Reddy: హైదరాబాద్: తెంగాణలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రులు, ఉన్నతాధికారులకు సూచించారు.  భూమి సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలని పేర్కొన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలని రేవంత్ రెడ్డి చెప్పారు.


భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ధరణి పోర్టల్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సమీక్ష ముగిసింది. ధరణిపై లక్షల సంఖ్యలో కంప్లైంట్స్ ఉన్నాయని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..  సమస్యల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి నివేదికలో పొందుపరచాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామెదర రాజనర్సింహ, సీఎస్ శాంతికుమారి, సంబంధిత శాఖలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ధరణి పోర్టల్ లోటు పాట్ల పై వారం, 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణిపై పూర్తి అవగాహన కోసం, సమస్యల పరిష్కారానికి పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నారు. ధరణి యాప్ భద్రతపై సైతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి ద్వారా లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.


అధికారంలోకి రాగానే భూముల సమస్యలు పరిష్కరించేందుకు ధరణిపై పూర్తి స్థాయిలో నివేదిక తీసుకుని భారీ మార్పులు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెప్పారు. తాజాగా ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి కొన్ని కీలక విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే భూమి సమస్యలు ఎందుకొచ్చాయి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఫిర్యాదులు ఎందుకొచ్చాయని అధికారులను ప్రశ్నించారు. సాధ్యమైనంత త్వరగా ధరణిపై నివేదిక అందివ్వాలని ఆదేశించారు. త్వరలోనే ధరణి అంశంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ధరణి పోర్టల్ మొదలుపెట్టినప్పటి నుంచీ నేటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందచేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎంవో అధికారులు శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ ఖాసీం లు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రైతు ప్రతినిధులు కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, రెవెన్యు అసోసియేషన్ ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.


Also Read: Telangana Politics: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఫైట్ ఇక షురూ! బీఆర్ఎస్ వ్యూహమిదే!