Indian Parliament Security: లోక్ సభలో జరిగిన భద్రతా లోపం సమస్య నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా విజిటర్ పాస్ ల జారీని రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ విజిటర్స్ పాసులు ఉండవని చెప్పారు. మరోవైపు, సభలో గ్యాస్ క్యాన్స్ ప్రయోగించడంపై స్పీకర్ అఖిలపక్ష భేటీకి పిలుపు ఇచ్చారు. లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతుకులు సభలోకి దూకి గ్యాస్ క్యాన్లు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ భద్రతా లోపానికి గల కారణాలపై సవివరమైన నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.


అంతేకాక, ఈ రోజు (డిసెంబర్ 13) ఇప్పటికే విజిటల్ పాస్ లు తీసుకున్న సందర్శకులను కూడా వెనక్కి పంపేశారు. అయితే, సందర్శకులను లోనికి పంపడాన్ని నిషేధిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు రాలేదని అధికారులు తెలిపారు. సాధారణంగా, సందర్శకుల పాస్‌లు రెండు గంటల సమయంతో జారీ చేస్తారు. ఎక్కువగా ఎంపీల బంధువులు, పార్టీల నేతలు పార్లమెంటు సమావేశాలు చూసేందుకు సందర్శకుల్లాగా వస్తుంటారు. అంతకు ముందు రోజు పలువురు ఎంపీల సతీమణులు కొత్త పార్లమెంట్ భవనంలో పర్యటించారు.


ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భద్రతా వైఫల్యంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన తరవాత సభ తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా కూడా పార్లమెంట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 2001 పార్లమెంటు దాడి రోజు సందర్భంగా భయాందోళనలకు గురిచేస్తూ పసుపు రంగులో గ్యాస్ స్ప్రే చేస్తూ సభ లోపలికి దుంకి.. పరిగెత్తుతుండగా నీలిరంగు జాకెట్ ధరించిన ఒకరు టేబుల్స్ పైకి ఎక్కుతూ కనిపించారు.


లోక్‌సభ గ్యాలరీలన్నింటిలోనూ ఇద్దరు భద్రతా అధికారులు ఉన్నారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. లోక్‌సభలోని సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి భీభత్సం చేసిన ఇద్దరు వ్యక్తులను సాగర్ శర్మ, మనోరంజన్‌లుగా గుర్తించారు.