Security Breach In Loksabha: 


పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం బయట పడింది. గుర్తు తెలియిన వ్యక్తి గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చాడు. టియర్ గ్యాస్ వదిలాడు. ఈ ఘటన అలజడి సృష్టించింది. భయంతో ఎంపీలు పరుగులు పెట్టారు. స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు.  జీరో అవర్‌లో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఇద్దరి ఆగంతుకులను పట్టున్నారు. 






2001లో పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు ఇవాళ్టికి 22 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు మరోసారి లోక్‌సభలోకి ఇలా ఆగంతకులు దూసుకురావడం కలకలం రేపింది. ఓ నిందితుడి పేరు సాగర్‌గా గుర్తించింది భద్రతా సిబ్బంది. దీనిపై పలువురు ఎంపీలు స్పందించారు.


"పబ్లిక్ గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూసుకొచ్చాడు. మరో వ్యక్తి లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి టియర్ గ్యాస్ ప్రయోగించాడు. ఈ గ్యాస్ కారణంగా మాకు కళ్ల మంటలొచ్చాయి"


- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ



మరో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఉన్నట్టుండి సభలోకి దూసుకొచ్చారని చెప్పారు. 


"20 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి సభలోకి దూసుకొచ్చారు. విజిటర్స్ గ్యాలరీలో నుంచి వచ్చారు. వాళ్ల చేతుల్లో ఏవో ఉన్నాయి. వాటి నుంచి పసుపు రంగు పొగ వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు స్పీకర్ కుర్చీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఏదో నినాదాలు చేశాడు. బహుశా ఆ పొగ విషపూరితం కావచ్చు. ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి"


- కార్తీ చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ







ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీ ఎంపీ ఖర్గేన్ ముర్ము మాట్లాడుతున్నారు. మొదట ఓ వ్యక్తి బ్యారియెర్‌పై నుంచి దూకాడు. ఆ తరవాత సభలోకి దూసుకొచ్చాడు. ఆ వ్యక్తి వెనకాలే మరో వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే ఇద్దరూ తమ షూలో నుంచి ఏదో బయటకు తీశారు. టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. అప్రమత్తమైన ఎంపీలు పరుగులు పెట్టారు. పార్లమెంట్ భద్రతా సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పార్లమెంట్ ఆవరణలో ఇద్దరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓ ఎంపీ కార్యాలయం నుంచి ఇష్యూ అయిన విజిటర్ పాస్‌లతో ఇద్దరూ విజిటింగ్ గ్యాలరీకి వచ్చినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది.