Telangana Dharani Committee: తెలంగాణ రాష్ట్రంలోని నిషేధిత భూముల కేటాయింపునకు సంబంధించి ధరణి కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేటీఆర్‌పై సంచలన ఆరోపణలను కమిటీ చేసింది. సోమవారం ధరణి కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. భూ హక్కుల విషయంలో 2014 వరకు అందరికీ సమాన న్యాయం ఉండేదన్న ధరణి కమిటీ.. ధరణి వల్ల 2015 తరువాత రైతుల భూ హక్కులను కోల్పోయారని పేర్కొంది.


గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని ఆరోపించిన ఈ కమిటీ.. బీఆర్‌ఎస్‌ తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగినట్టు వెల్లడించింది. కోటి 35 లక్షల వ్యవసాయ భూమిని చెరసాలలో పెట్టారని ఆరోపించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూమలను కేటీఆర్‌ కుటుంబానికి బదలాయించారంటూ కీలక ఆరోపణలను కమిటీ సభ్యులు చేశారు. గత ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండానే భూ రికార్డులను ప్రక్షాళన చేసిందంటూ కమిటీ పేర్కొంది. ఈ ప్రక్రియను దివాళా తీసిన ఓ కంపెనీకి అప్పగించారంటూ ఆక్షేపించిన ధరణి కమిటీ.. ఎక్కడా జరగని విధంగా భూ కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిందని స్పష్టం చేసింది. 


ధరణిపై కమిటీ వేసిన రేవంత్‌ సర్కారు 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైనది ధరణి పోర్టల్‌. రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ప్లాట్‌ఫామ్‌ ఇది. దీనిపై సుదీర్ఘకాలంగా వివాదం నడస్తోంది. ధరణి పోర్టల్‌ వల్ల ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, భూములు ఉన్న రైతుల తమ పేర్లను ఇందులో రిజిష్టర్‌ చేయించుకోలేకపోతున్నారే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామంటూ ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.


ప్రజా దర్బార్‌లోనూ దీనికి ఫిర్యాదులు భారీగా అందాయి. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్‌ పనితీరుపై సీఎం రేవంత్‌ సమీక్షించారు. ఇప్పటి వరకు ధరణి పోర్టల్‌పై అందిన సమస్యలను క్రోడీకరించి వాటిని త్వరగా పరిష్కరించాలని భావించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. దీని కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అనేక అంశాలను పరిశీలించిన తరువాత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కమిటీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు, ముఖ్యంగా కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.